తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Hyderabad Metro : హైదరాబాద్​లో ఆ రెండు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు.. అవేంటో తెలుసుకోండి

SBI Agreement With Hyderabad Metro : ఏదైనా సంస్థలు మార్కెటింగ్ ప్రమోషన్స్‌ కోసం వివిధ సంస్థలతో జతకడుతుంటాయి. అందుకనుగుణంగా వాటికి సంబంధించిన వివరాలను ప్రజలకు చేరేలా ప్రకటనలు రూపొందిస్తాయి. ఇప్పుడు దీనిని హైదరాబాద్ మెట్రో ఆదాయవనరుగా మార్చుకుంది. ఇప్పటివరకు మనం మెట్రోరైళ్లపై వివిధ ప్రకటనలు చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఏకంగా మెట్రోస్టేషన్లనే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల పేరుతో బ్రాండింగ్ హక్కులను కల్పిస్తుంది. తద్వారా ఆ స్టేషన్ల పేర్లు స్వల్పంగా మారబోతున్నాయి.

SBI Hitechcity Metro
SBI Hitechcity Metro

By

Published : Jun 6, 2023, 10:03 AM IST

SBI Hitechcity Metro :అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌ వాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు ప్రజల ఆదరణను చూరగొంది. వివిధ సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రోరైలు పేరుపొందింది. అయితే లాక్‌డౌన్‌ కాలంలో నష్టాల బాటలో నడిచింది. అనంతరం సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో తిరిగి గాడిలో పడ్డ.. ఆశించిన మేర ఆదాయం రావడం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ మెట్రోతో ఎస్‌బీఐ ఒప్పందం : అయితే తిరిగి పునర్వైభవాన్ని పొందడానికి హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటుంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు ప్రాధాన్యతను ప్రజలకు వివరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రోతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకొంది. ఇందులో భాగంగానే మాదాపుర్‌లోని హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రోస్టేషన్ల పేర్లు, బ్రాండింగ్ హక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. దీని ప్రకారం హైటెక్‌సిటీ, బేగంపేట పేర్ల ముందు ఎస్‌బీఐ పేరు చేర్చారు.

HitechCity Metro Station : ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్‌ కుమార్ ఖారా హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రత్యేకతను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇందులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడి స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు దినేశ్‌ కుమార్ ఖారా తెలిపారు. ఈ క్రమంలోనే హైటెక్ సిటీ మెట్రోస్టేషన్‌లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరికరాన్ని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

"హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రత్యేకతను ప్రజలకు వివరిస్తాం. ఈ మేరకు మెట్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రో స్టేషన్ల పేరు, బ్రాండింగ్ హక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం." - దినేశ్‌ కుమార్ ఖారా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్

శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు మెట్రో సేవలు : మరోవైపు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు మెట్రో సేవలు అందించేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు.. స్టేషన్‌ను పొడిగించి అక్కడ ఎయిర్‌పోర్టు మెట్రోస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 31 కారిడార్​లు నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details