మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.30 వేలు పరిహారం కింద చెల్లించాలని బాధితురాలి భర్తను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?ఇందోర్‌లోని మహాలక్ష్మినగర్‌కు చెందిన 26 ఏళ్ల బాధితురాలు.. అదే ప్రాంతంలో ఉంటున్న దిలేశ్వర్ను (32) ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే ఆమెను తన భర్తతోపాటు అత్త వేధించడం ప్రారంభించారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకుని దిలేశ్వర్.. పుణెలో కాపురం పెట్టాడు. కొద్దిరోజులకే బాధితురాలి అత్త అక్కడికి కూడా వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక, ఆమె ఎదురుతిరగడం వల్ల కన్నవారింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్ వేసింది. అప్పుడు ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది.