కర్ణాటకలోని హోసకోటేలో అమానవీయ ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. అత్యంత కిరాతకంగా ఆమెపై దాడి చేశాడు. 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హోసకోటేకు చెందిన రమేశ్, అర్పిత.. ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే గత ఏడాదిగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుందామని దంపతులిద్దరూ నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు.
భర్తకు దూరమైన అర్పిత తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం నిందితుడు రమేశ్ తన భార్య అర్పితతో మాట్లాడాడు. ఇద్దరం తిరిగి కలిసి ఉందామని భార్యకు నచ్చజెప్పాడు. ఈ క్రమంలో శనివారం ఆమెను హోసకోటే ఇండస్ట్రీయల్ ప్రాంతానికి తీసుకెళ్లి.. మెడ, ఉదరభాగంపై కత్తితో 15 సార్లు పొడిచాడు. అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. వీరిని గమనించిన స్థానికులు.. ఇద్దరినీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ బాధితురాలు అర్పిత మరణించింది.