రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మొదటి భార్యకు ప్రాణాంతకమైన ఇంజక్షన్లు, మందులు ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. నిందితుడు స్వప్నిల్ సావంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్వప్నిల్ సావంత్.. ప్రియాంకను కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వప్నిల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో అతడికి పరిచయం ఏర్పడి.. అదికాస్త ప్రేమగా మారింది. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే అప్పటికే నిందితుడు స్వప్నిల్‌కు వివాహం జరిగింది. తన రెండో వివాహానికి మొదటి భార్యే అడ్డుగా ఉందని భావించాడు. ఎలాగైనా మొదటి భార్య ప్రియాంకను హతమార్చాలని ప్లాన్ చేసుకున్నాడు. బీపీ, షుగర్ చికిత్స అని చెప్పి.. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎవరికీ తెలియకుండా ప్రమాదకరమైన ఇంజెక్షన్లను భార్యకు ఇచ్చాడు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది.
నర్సుతో పెళ్లి కోసం మొదటి భార్య హత్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి పొలంలో.. - ఓయో హోటల్లో కాల్పులు
వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి.. మొదటి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి శరీర భాగాలను వేరుచేసి చెరుకు పొలంలో పడేశాడు. ఈ హృదయవిదారక ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
మొండెం, చేయి, కాలు వేరుచేసి..
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో ఘోరం జరిగింది. నవంబరు 8న చెరుకు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అప్పుడు మృతదేహానికి చేయి, కాలు, మొండెం లేకపోవడం వల్ల పోలీసులు ఆమె ఎవరనేది గుర్తించలేకపోయారు. ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. మృతురాలి పేరు జ్యోతి అని తెలిపారు. ఆమె భర్త పంకజ్ మౌర్యే.. నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. భార్యను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం ఆమె శరీర భాగాలను నిందితుడు వేరు చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
ఓయో హోటల్లో..
దిల్లీ.. నరేలాలో దారుణం జరిగింది. ఓయో హోటల్లో ఓ వ్యక్తి యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రక్తపుమడుగులో ఉన్న ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని ప్రవీణ్‌గా గుర్తించారు పోలీసులు. ఓ హత్య కేసులో అరెస్టైన అతడు నవంబరు 18న బెయిల్‌పై బయటకు వచ్చాడు. యువతితో గొడవ జరగడం వల్ల కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.