బిహార్ భోజ్‌పుర్‌లో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త.. భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాదం ఆరా సమీపంలోని నవాడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్, అనిల్‌కు 10 ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలు వేరే కాపురం ఉన్న ఈ దంపతులు మళ్లీ.. అనిల్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. సోషల్ మీడియాలో అన్నూ రీల్స్ చేస్తుండేది. భార్య అలా చేయడం ఆమె భర్త అనిల్‌కు నచ్చలేదు. దీంతో దంపతుల మధ్య ఇదే విషయంపై తరచుగా గొడవలు జరిగేవి. మొబైల్లో ఉన్న సోషల్ మీడియా యాప్‌ను డిలీట్ చేయమని అనిల్ ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనిల్ భార్యపై కోపంతో గొంతు నులిమి హత్యచేశాడు. రాత్రంతా భార్య మృతదేహం వద్దే కూర్చున్నాడు.
సమాచారం అందుకున్న నవాడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.'నా భార్య వీడియోలను స్నేహితులు, సన్నిహితులు చూసి హేళన చేస్తున్నారు. వీడియోలు చేయడం ఆపేయమని చాలాసార్లు హెచ్చరించాను. అయినా వినలేదు. అందుకే చంపేశా' అని పోలీసుల విచారణలో అనిల్ తెలిపాడు.
"ఆదివారం రాత్రి నా కుమారుడు, కోడలు ఇంటి రెండో అంతస్తులోని తమ గదిలో నిద్రించడానికి వెళ్లారు. సోమవారం ఉదయం నా భార్య రూమ్‌ను శుభ్రం చేసేందుకు పైకి వెళ్లగా.. గది లోపల నుంచి తాళం వేసి ఉంది. తలుపు కొట్టినా ఎవరూ తెరవడం లేదు. బలవంతంగా తలుపు తీసి చూడగా లోపల అన్నూ మృతదేహం కనిపించింది. అనిల్ పక్కనే కూర్చున్నాడు. తానే తన భార్యను చంపినట్లు నా కుమారుడు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. "
--శివశంకర్ , నిందితుడి తండ్రి