Husband Kills Wife: భార్య తెచ్చిన టిఫిన్లో (కిచిడీ) ఉప్పు ఎక్కువైందనే వింత కారణంతో గొంతు నులిమి చంపేశాడు భర్త. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. నిందితుడిని నీలేష్ ఘాగ్గా(46) పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక మరే కారణమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదే తరహా ఘటన ఏప్రిల్ 15న ఠాణెలో జరిగింది. టీ ఇచ్చి టిఫిన్ పెట్టలేదన్న కారణంతో కోడలిపై కాల్పులు జరిపాడు మామయ్య. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ శనివారం మరణించిందని పోలీసులు తెలిపారు.