కర్ణాటకలో దారుణమైన ఘటన జరిగింది. రాయచూర్ (Karnataka Raichur News) శివార్లలోని యరామర ప్రాంతంలో ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురయ్యారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులను సంతోషి(45), వైష్ణవి(18), ఆర్తి(16)గా గుర్తించారు. వైష్ణవి మాజీ భర్త సౌరభ్ అలియాస్ సాయి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆరు నెలల క్రితం వైష్ణవికి, హైదరాబాద్కు చెందిన సాయికి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. రోజూ వీరి మధ్య తగాదా జరిగేదని, దంపతుల మధ్య సఖ్యత ఉండేది కాదని తెలిసినవారు చెప్పారు. దీంతో వైష్ణవి తన భర్తకు విడాకుల నోటీసు ఇచ్చిందని వెల్లడించారు.
దీనిపై భర్త సాయి.. తీవ్రంగా స్పందించాడు. మంగళవారం రాత్రి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అదే ఆవేశంలో భార్యను, ఆమె తల్లి, చెల్లిని సైతం హత్య (Husband kills wife) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.