Tirupati Double Murder Case: తిరుపతిలో అన్నాచెల్లెల దారుణ హత్య కలకలం రేపింది. కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్లో మహారాష్ట్రలోని నాదెండ్కు చెందిన యువరాజ్ అనే నిందితుడు తన భార్య, బావమరిదిని కత్తితో దారుణంగా హతమార్చాడు. నిందితుడు యువరాజ్ హత్యకు పాల్పడిన సమయంలో పక్కనే ఉన్న తన ఇద్దరు పిల్లలను వదిలేసి పరారయ్యాడు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అలిపిరి డీఎస్పీ సురేంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు పోలీసుల సంరక్షణలో ఉన్నారని, వాళ్ల కుటుంబ సభ్యులు రాగానే వారికి అప్పగిస్తామన్నారు.
అనుమానంతో భార్య, పిల్లలపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ చిన్న కుమారుడు మృతి
కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. వివాహేతర సంబంధం చిచ్చు కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. విభేదాలను తొలగించి అక్క, బావలను ఒక్కటి చేయాలనుకున్న బావమరిది తోపాటు భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. డీఎస్పీ సురేంద్రరెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న వివరాల మేరకు.. ‘మహారాష్ట్ర నాందేడ్ జిల్లా టరోడా కూడ్‌లోని నవజీవన్ నగర్‌కు చెందిన యువరాజ్ సంభాజి నార్వాడే (37) భార్య మనీషా యువరాజ్ (30), బావమరిది హర్షవర్ధన్ (25), ఆరేళ్ల కుమారుడు పక్షమ్, నాలుగేళ్ల కుమార్తె ప్రజ్ఞాన్‌తో కలసి తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి ఆలయ సమీపంలోని హోటల్‌కు గురువారం సాయంత్రం 3.30 గంటలకు వచ్చారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చినట్లు హోటల్‌లో నమోదు చేశారు. రాత్రికి హోటల్ గదికి భోజనం తెప్పించుకుని తిన్నారు. ఆ తరువాత కొడుకుతో కలసి సెల్ఫీ తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి హోటల్‌లో జంట హత్య జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హోటల్ గదిలో మనీషా, హర్షవర్ధన్ రక్తపు మడుగులోపడి మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సురేంద్రరెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మహిళపై హత్యాయత్నం.. దారికాచి.. స్కూటీని ఢీకొట్టి కత్తులతో దాడి
వివాహేతర సంబంధమే కారణమా?:ఎనిమిదేళ్ల కిందట మనీషాతో యువరాజ్‌కు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మనీషా ప్రవర్తనపై భర్త యువరాజ్‌కు అనుమానం వచ్చింది. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిగా అతను ఇల్లు వదిలి బయట తిరుగుతున్నారు. నాలుగు రోజుల కిందట తిరుపతికి వచ్చాడు. అతని బామ్మర్ది హర్షవర్ధన్ అక్క భావ మధ్య విభేదాలు తొలగించాలని ప్రయత్నించే క్రమంలో బావకు ఫోన్ చేశారు. తాను తిరుపతిలో ఉన్నానని.. ఇక్కడికి వస్తే మాట్లాడుకుందామని పిలిచారు. దీంతో అక్క, ఇద్దరు పిల్లలను తీసుకుని హర్షవర్ధన్ తిరుపతికి వచ్చారు. వారి మధ్య నెలకొన్న విభేదాలపై చర్చ జరిగింది. ఆ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు యువరాజ్ ముందే తెచ్చుకున్న కత్తితో భార్య, బావమరిదిపై అతి దారుణంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.
నిందితుడే డయల్ 100కు సమాచారం:భార్య, బావమరిదిని హత్యచేసిన తర్వాత నిందితుడు డయల్ 100కు ఫోన్ చేసి హతమార్చిన విషయం చెప్పారు. హత్యానంతరం పిల్లలతో కలసి ఐదు గంటల పాటు హోటల్ గదిలో ఉన్నాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పిల్లలను వదిలివెళ్లి పరారైనట్లు సమాచారం. నిందితుడి అన్నతో.. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు శనివారం ఉదయానికి చేరుకునే అవకాశం ఉంది. ఆపై కేసు నమోదు చేసి మృతదేహాలను అప్పగించనున్నారు.
వాలంటీర్ నిర్వాకం.. అడ్డుగా ఉన్నాడని అంతమొందించాడు