భార్య రోజూ స్నానం చేయని కారణంగా తనకు విడాకులు ఇప్పించాలంటూ భర్త కోర్టు మెట్లు ఎక్కిన ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి.. తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. అయితే ఈ ఘటనలో వీరి దాంపత్యం విడాకుల దాకా వెళ్లడానికి కారణం అతిశుభ్రత.
రోజుకు ఆరుసార్లు స్నానం..
ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన ప్రకారం... బెంగళూరులోని ఆర్టీ నగర్లో నివసిస్తున్న ఈ దంపతులకు 2009లో వివాహమైంది. బెంగళూరు రాకముందు కొంతకాలం లండన్‌లో ఉండేవారు. అప్పటి నుంచే భార్యకు శుభ్రతపైన శ్రద్ధ ఎక్కువ ఉండేది. మొదటి కాన్పు తర్వాత అది మరింత ఎక్కువైంది. భర్తను బూట్లు, బట్టలు, ఫోన్లూ తరచూ శుభ్రం చేయమనేది.
ఆ తర్వాత కొంతకాలానికి భారత్‌కు తిరిగివచ్చినా ఆమె వైఖరిలో మార్పులేదు. దీంతో విసుగు చెందిన భర్త డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆమె ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్)తో బాధపడుతున్నట్లు తేలింది. కౌన్సెలింగ్‌కు తర్వాత కాస్త మార్పు కనిపించింది. కానీ రెండోసారి బిడ్డకు జన్మనిచ్చాక ఈ పరిశుభ్రతపై మరోసారి శ్రద్ధ ఎక్కువైంది. అది కాస్తా గతేడాది లాక్‌డౌన్‌తో తారస్థాయికి చేరింది. భర్త వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, ఫోన్లను డిటర్జెంట్లతో శుభ్రం చేసేది. తరచూ స్పూన్లు, మ్యాట్లు సహా ఫర్నిచర్‌ను శానిటైజ్ చేసేది. ఈ అతిశుభ్రత ఏ స్థాయికి వెళ్లిందంటే.. అందరూ స్నానాలు ముగించుకున్నాక వారు వాడిన సబ్బును కూడా శుభ్రం చేయడం సహా రోజుకు ఆరుసార్లు స్నానం చేసేది.
భార్య ప్రవర్తనకు విసుగు చెందిన భర్త విడాకులు ఇచ్చేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు ఆర్టీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును ఉమన్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు బదిలీ చేశారు.
ఇదీ చూడండి :భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి