Husband Delivers Baby at Home See Youtube Video :యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేశాడు ఓ భర్త. సరైన వైద్య పరిజ్ఞానం లేకుండా ప్రసవం చేయడం వల్ల ఓ శిశువుకు జన్మనిచ్చి అతడి భార్య మరణించింది. ఈ దారుణం తమిళనాడు.. కృష్ణగిరి జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యూట్యూబ్ చూసి ప్రసవం చేయడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ జరిగింది
పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్తో 2021లో వివాహం జరిగింది. అతడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మాదేశ్ భార్య ఇటీవల గర్భం దాల్చింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే మాదేశ్.. ప్రసవం కూడా ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతిలో వైద్యం చేయాలని భావించాడు. అందుకోసం లోకనాయకికి ఎలాంటి వైద్యం అందించలేదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు లోకనాయకి గర్భం దాల్చిన విషయం తెలిసి.. ఆమెకు వైద్య సదుపాయం అందించాలని చూశారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. అందుకు మాదేశ్ ఒప్పుకోలేదు.
ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు పౌష్ఠికాహారాన్ని సైతం నిరాకరించాడు. స్థానిక వైద్యాధికారి పట్టుపట్టడం వల్ల రెండు వ్యాక్సిన్లను వేయడానికి అనుమతిచ్చాడు. ఆ తర్వాత లోకనాయకి పరిస్థితిని గమనించిన స్థానిక వైద్యాధికారులు.. ఆమెకు వైద్యం అందించాలని చెప్పారు. వైద్యాధికారులు ఒత్తిడి చేయడం వల్ల.. లోకనాయకిని తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడే చికిత్స చేస్తున్నాడు. పౌష్ఠికాహారం కోసం ప్రధానంగా గింజలు, ఆకుకూరలు అందించేవాడు.