Husband Chops Wife Into Pieces :భార్య గొంతు నులిమి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడో భర్త. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు వాటిని రుషికల్య నదిలో పారేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
సొరోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగబన్పుర్ గ్రామానికి చెందిన నారాయణ్ ములి అనే వ్యక్తి.. బులి అనే మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, బుధవారం రాత్రి ఓ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రంగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త నారాయణ్ ములి.. భార్య బులి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని రుషికల్య నది వద్దకు తీసుకెళ్లాడు. తర్వాత ఆమె కాళ్లు, చేతులు, తొడలు, మెడను ముక్కలుగా నరికాడు. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు వాటిని రుషికల్య నదిలో పడేసి వెళ్లిపోయాడు.
మరోవైపు తమ కూతురు కనిపించకుండాపోవడం వల్ల బులి తల్లిదండ్రులు సొరోడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త నారాయణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. తానే మృతదేహాన్ని ముక్కలుగా నరికి నదిలో పడేశానని పోలీసులకు చెప్పాడు. అనంతరం నిందితుడిని తీసుకుని మృతదేహం కోసం నదిలో గాలించారు.