Husband Built a Forest in Wife Memory :భార్యకు గుర్తుగా తాజ్మహాల్ను నిర్మించాడు షాజహాన్. అచ్చం అలాగే చనిపోయిన తన భార్యపై ప్రేమతో భారీ అడవిని సృష్టించాడు కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి. 5 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ చెట్లతో కూడిన కృత్రిమ అడవిని తయారు చేశారు అల్వా విద్యాసంస్థల అధినేత డాక్టర్ మోహన్ అల్వా. 1998లో మరణించిన తన భార్య శోభ పేరిట ఈ వనాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్న చెట్లను పెంచుతున్నారు. ముఖ్యంగా కాలిన గాయాలకు ఉపయోగించే పుత్రంజివా, తలనొప్పికి ఎర్ర చందనం, అనీమియాకు అగ్నిమత, లెప్రసీకి నాగకేసర, పన్నునొప్పిని తగ్గించే స్పానిష్ షెర్రీ మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు పక్షవాతం నివారణకు ఉపయోగించే టర్మినలియా చెబులా, ఆస్తమాకు టర్మినలియా బెల్లిరికా, కదంబ చెట్లను పెంచుతున్నారు.
ఈ అడవిలో రాశివనం, నవగ్రహ వనం, గణేశ పూజ వనం, పంచభూత వనం, సత్యనారాయణ పూజవనం, అష్టాదిపలక వనం, కదంబ వనం, శనిపూజ వనం, భూతరదాన వనం పేర్లతో సుమారు 1,200 రకాల చెట్లను పెంచుతున్నారు. ఔషధ గుణం ఉన్న చెట్లతో పాటు సత్యనారాయణ పూజ, వ్రతాలకు అవసరమయ్యేవి ఇందులో ఉన్నాయి. వీటిని ఎలాంటి రసాయనాలు వాడకుండా.. కేవలం ఆవు పేడ, ఆవు మూత్రం, వేప ఆకులతో పెంచుతున్నారు.
"పశ్చిమ కనుమల్లో లభించే అరుదైన చెట్లతో శోభవన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ వివిధ రకాల ఆయుర్వేద మొక్కలతో పాటు పూజలకు ఉపయోగపడే వాటిని పెంచుతున్నాం. ఇలాంటి అడవి ఎక్కడా లేదు. వివిధ ప్రాంతాల్లో ఆయుర్వేద విద్యను అభ్యసించే విద్యార్థులు సైతం ఇక్కడి అరుదైన చెట్లను చూసేందుకు వస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పిల్లలకు మన అసలు సంస్కృతిని తెలిపేందుకే డాక్టర్ మోహన్ అల్వార్ ఈ అడవిని పెంచారు."