సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన కార్యాచరణ ఎలా ఉండనుందన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. రాజకీయాలంటే చిన్న వ్యవహారమేమీ కాదు. ఆచితూచి అడుగులు వేయాలి. ప్రత్యర్థులను ఎదుర్కొనేలా వ్యూహ రచన చేసే నేర్పు కావాలి. ఓటమి ఎదురైనా ఓర్పుగా ఉండాలి.
'తమిళ ప్రజల తలరాత మారుస్తా..' అంటూ ధీమాగా చెప్పిన తలైవా.. ముందుగానే ఇందుకు తగ్గట్టుగా.. క్షేత్రస్థాయిలో స్థితిగతులు పరిశీలించారా? అన్నది ప్రధానంగా చర్చించాల్సిన విషయం. ఎన్నో ఏళ్లుగా తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీలదే పైచేయి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ అక్కడ నిలదొక్కుకోగలుగుతారా? సంవత్సరాల పాటు కొనసాగుతున్న ఒరవడికి స్వస్తి పలికి విజయపతాకం ఎగరవేస్తారా? ఆయన పార్టీ ముందున్న సవాళ్లేంటి?
సన్నద్ధమయ్యారా?
అయితే ఏఐఏడీఎమ్‌కే, లేదంటే డీఎమ్‌కే. తమిళనాడును ఏలే పార్టీలు ఈ రెండే. ఇలాంటి ఘనమైన, బలమైన చరిత్ర ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే.. ఎంత సన్నద్ధత కావాలి? ఎంత సమర్థత ఉండాలి? ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీకి అవసరమైనవి ఇవే. గతంలో పలువురు సినీనటులు తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొందరు విజయం సాధించారు. మరికొందరు విఫలమయ్యారు. కానీ రజనీకాంత్‌కు ఉన్న చరిష్మా చూసి.. ఆయన రాజకీయ ప్రస్థానం నల్లేరుపై నడకలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మాస్ ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరు. ఇదే విషయం గతంలో పలు సందర్భాల్లో తెలిసొచ్చింది కూడా. అలా అని ఏ మాత్రం నిలదొక్కుకోలేరు అని చెప్పటానికీ వీల్లేదు. సరైన ప్రణాళికలు, కార్యాచరణ ఉంటే.. రజనీ ఆధిపత్య పార్టీలకు గట్టి పోటీనివ్వటం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ పండితులు.
ఇదీ చూడండి:-2021 ఎన్నికల బరిలో కమల్ హాసన్
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు.. రజనీకాంత్ ఏడాదిగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఆయనకు అభిమానులు ఎక్కువే కావచ్చు. ఆయనను అలా ఇంటి బయటకు వచ్చి చేయి ఊపినా.. జనాలు సంబరాలు చేసుకోవచ్చు. కానీ.. రాజకీయంగా చూస్తే వీరంతా రజనీకి మద్దతు తెలుపుతారా? ప్రతి అభిమాని ఓటు.. రజనీ పార్టీకే పడుతుందా? అన్నది కచ్చితంగా చెప్పలేం. ఇది జరగాలంటే.. నియోజకవర్గాల వారీగా చురుకైన బృందాలను నియమించుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు.. రాజకీయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటూ.. అందుకు తగ్గట్టుగా ముందుకు కదలాలి. ముందుగా పార్టీని బలోపేతం చేసుకుని.. అప్పుడు ఎన్నికల బరిలోకి దిగాలన్నది పలువురి నిపుణుల అభిప్రాయం.
వయసు ప్రభావం?
రజనీ వయసు ఇప్పుడు 69 సంవత్సరాలు. ఈ వయసులో క్షేత్రస్థాయిలో చురుగ్గా కదిలి ప్రజలకు చేరువవటం సాధ్యమేనా? అన్నది మరో ప్రశ్న. ఇటీవల కాలంలో ఆయన పలు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొన్నారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నాననీ ప్రకటించారు. అంటే.. ఆయన పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేంత వరకు అలుపెరగకుండా పని చేయాల్సి ఉంటుంది. అందుకు రజనీ ఆరోగ్యం సహకరిస్తుందా ? అన్నది చూడాలి. ఈ విషయమై.. పార్టీ శ్రేణులు మాత్రం స్పష్టత ఇస్తున్నాయి. రజనీ ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ చర్చలు, వ్యూహ రచనలు అన్నీ పరిమిత సభ్యులతోనే సాగుతున్నట్టు చెబుతున్నాయి. ఇందుకోసం ఐపీఎల్‌లో అనుసరించిన బయో బబుల్ విధానాన్నే అనుసరించనున్నారు. ర్యాలీలు, రోడ్‌షోల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోనున్నారు. అత్యంత సన్నిహితులు, పార్టీలోని సీనియర్ నేతలతో మాత్రమే రజనీ చర్చించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.
మరాఠీ ముద్ర...