తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్షకుల ఆందోళనలో కదం తొక్కిన మహిళలు - దిల్లీలో రైతుల ఆందోళన

ఇంటి పనులు చక్కబెట్టడంలో, పొలం పనుల్లో ఓ చేయి వేయడంలోనే కాకుండా దిల్లీ వరకు వచ్చి రైతన్నలతో పాటు గళం వినిపించడానికి మహిళలంతా కదం తొక్కారు. వారిలో చాలామంది ఇంతవరకు ఒక్కసారీ దిల్లీ వరకు రాకపోయినా ఉద్యమ దీక్షలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించడానికి వ్యయప్రయాసలకు ఓర్చుకుని తరలివచ్చారు.

Hunger strike
కర్షకుల ఆందోళనలో కదం తొక్కిన మహిళలు

By

Published : Dec 14, 2020, 5:50 AM IST

భర్తకు అండగా భార్య, కుమారుడికి తోడుగా తల్లి, సోదరునికి చేదోడుగా సోదరి.. ఇలా అతివలంతా కొంగు బిగించి ముందుకు ఉరకడంతో రైతుల ఉద్యమం ఆదివారం కొత్త రూపు సంతరించుకుంది. ఇంటి పనులు చక్కబెట్టడంలో, పొలం పనుల్లో ఓ చేయి వేయడంలోనే కాకుండా దిల్లీ వరకు వచ్చి రైతన్నలతో పాటు గళం వినిపించడానికి వారంతా కదం తొక్కారు. వారిలో చాలామంది ఇంతవరకు ఒక్కసారీ దిల్లీ వరకు రాకపోయినా ఉద్యమ దీక్షలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించడానికి వ్యయప్రయాసలకు ఓర్చుకుని తరలివచ్చారు. ముఖ్యంగా పంజాబ్‌, హరియాణాల నుంచి వచ్చిన మహిళలు దిల్లీ సరిహద్దుల్లో వివిధ చోట్ల తమ గళం వినిపించారు.

పురుషులంతా ఆందోళన చేస్తుంటే తాము మాత్రం ఇళ్ల వద్ద ఎందుకు కూర్చోవాలనే ఉద్దేశంతో దిల్లీకి వచ్చినట్లు లూథియానాకు చెందిన మన్‌దీప్‌ కౌర్‌ (53) చెప్పారు. పురుషులు దిల్లీకి రావడంతో ఇంటిని చూసుకోవడంతో పాటు పొలం పనులనూ తామే చేస్తున్నామని మరికొందరు మహిళలు తెలిపారు. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని చెప్పారు. శిబిరాల్లో రాత్రిపూట నిద్రించడానికి, కాలకృత్యాలకు తగిన సౌకర్యం లేకపోయినా రైతులకు సంఘీభావంగా వచ్చినవారు వాటన్నిటినీ ఓర్చుకున్నారు.

భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తమకు తెలిసినా ఉద్యమం ఇంత పెద్దదన్న విషయం స్వయంగా చూశాకే అర్థమయిందని సుఖ్వీందర్‌ అనే మహిళ చెప్పారు. బయటి ప్రపంచంతో అంతగా పరిచయం లేకపోయినా తొలిసారి కళ్లారా ఉద్యమాన్ని చూస్తున్నానని, ఎంతకాలమైనా ఓపిగ్గా పోరాడతామని వివరించారు. దేశంతో పాటు యావత్‌ ప్రపంచం తమకు అండగా ఉందని చెప్పారు. రైతుల డిమాండ్లపై తాము ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించగలమని దల్జీందర్‌ కౌర్‌ (75) ఆశాభావం వ్యక్తంచేశారు. హక్కుల్ని సాధించుకునేవరకు వెనుదిరిగేది లేదని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details