శాస్త్ర సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ మూఢనమ్మకాలతో అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే తమిళనాడు తిరువారూర్లో జరిగింది. జ్యోతిషుల మాట విని సొంత కుమారుడినే సజీవ దహనం చేశాడో కిరాతక తండ్రి.
ఏం జరిగింది?
తిరువారూర్కు సమీపంలో ఉన్న నన్నిలామ్లోని పెరుమాళ్ ఆలయ వీధిలో 29 ఏళ్ల రామ్కీ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి భార్య గాయత్రి, ఐదేళ్ల కుమారుడు సాయిశరణ్ ఉన్నారు. ఆటోలు, కార్లు నడుపుతూ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు రామ్కీ.
మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. తన కొడుకు సాయిశరణ్ను తిడుతూ ఇంట్లో నుంచి బయటకు గెంటేసే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా.. సాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భర్త ప్రవర్తనతో గాయత్రి షాక్కు గురైంది.