Human Sacrifice In Odisha : ఒడిశాలో 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడ్ని చెట్టుకు ఉరివేసి.. కాళ్లు, చేతులు నరికేశారు నిందితులు. కళ్లు సైతం తొలగించారు. అంగుల్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యను నరబలిగా అనుమానిస్తున్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కియాకటా పోలీసు స్టేషన్ పరిధిలోని సుబర్ణాపుర్ గ్రామానికి చెందిన.. సంచిత్ అనే బాలుడు ఇలా హత్యకు గురయ్యాడు. అతడి శరీర భాగాలు వివిధ చోట్ల పడేసి ఉన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాలుడి హత్యకు ముందు.. అతడి ఆరోగ్యం అంతగా బాగుండలేదని తల్లి బసంతి తెలిపింది. దీంతో పూజలు నిర్వహించేందుకు మంగళ కోఠి అనే ఆలయానికి జులై 22న కొడుకును తీసుకెళ్లినట్లు వెల్లడించింది. రీతాంజలి అనే మహిళ అధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తోందని.. ఆ రోజు రాత్రి తామిద్దరం వేరే వేరే గదిలో బస చేసినట్లు పేర్కొంది. మరుసటి తెల్లారి సంచిత్ కనిపించకుండా పోయాడని వాపోయింది.
అనంతరం దీంతో కంగారు పడ్డ తల్లి బసంతి.. కొడుకు కోసం పలు చోట్ల గాలించింది. ఎంతకీ కుమారుడి ఆచూకీ లభించని కారణంగా జులై 24న పోలీసులను ఆశ్రయించింది. జూలై 28న స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసి ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడ్ని చంపిన తీరును చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. సంచిత్నునరబలి ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. మంగళ కోఠి ఆలయ పూజారి రీతాంజలే ఈ ఘటన పాల్పడి ఉంటుందని భావించారు. అనంతరం రీతాంజలిని.. ఆమె ముగ్గురు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రాథమికంగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ తరువాతే హత్యకు గల కారణాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.