గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దాదాపు అన్నివర్గాలతోపాటు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్రప్రభావం చూపింది. అంతేకాదు కరోనా వల్ల దేశంలోని పురుషులు, మహిళల ఆయుర్దాయం సగటున రెండేళ్లు తగ్గింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ ఓ నివేదిక విడుదల చేసింది. ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో తయారైన ఈ నివేదికను బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్ ఇటీవల ప్రచురించింది. కరోనా మహమ్మారి వల్ల ఆడ, మగ ఆయుర్దాయం తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది.
దేశంలోని మరణాలపై కొవిడ్ ప్రభావం, పర్యావసనాలపై ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ అధ్యయనం చేశారు. శిశువు జన్మించిన సమయంలో మరణాల రేటు స్థిరంగా ఉంటే నవజాత శిశువు జీవించే సగటు సంవత్సరాల సంఖ్య ఆధారంగా ఆయుర్దాయం లెక్కిస్తారు. 2019 నివేదిక ప్రకారం పురుషుల జీవితకాలం 69.5ఏళ్లు మహిళల జీవితకాలం 72ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు తగ్గటం వల్ల పురుషుల ఆయురార్దం 67.5 ఏళ్లు, మహిళల జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు 2020 నివేదికలో పేర్కొంది.