రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు.. వరద ప్రవాహంతో గోదారమ్మ పరుగులు Huge Water Inflow to Projects in Telanagana : భారీ వర్షాలతో దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి నదికి వరద ప్రవాహం పెరగుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారుతున్నాయి. మహారాష్ట్రలో వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 59వేల 165 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం వెయ్యి 91 అడుగులు కాగా... ప్రస్తుతం వెయ్యి73.6 అడుగులకు చేరింది. 90.3 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి ప్రస్తుతానికి 36.954 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సింగూరు ప్రాజెక్టుకు 8వేల 440 క్యూసెక్కులు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 23వేల 400క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.
Heavy Water flow in Kaleshwaram Project : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంకాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ప్రస్తుతం 10వేల 978క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా... 4వేల 889క్యూసెక్కులను బయటికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా... 5.663 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 10వేల 226క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టులో 20.175 టీఎంసీల సామర్థ్యానికి గానూ... 15.276 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపు జోరు.. ప్రాజెక్టులకు వరద హోరు : తెలంగాణ, మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్ల మెట్లపై నుంచి నది ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద 9.980 మీటర్ల మేర నీటి మట్టం నమోదుకాగా... మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ నిండుకుండలా మారింది. భారీ వర్షాలు కురుస్తుండడం, 15 రోజులుగా సరస్వతి పంపుహౌస్ నుంచి... నీటిని ఎత్తిపోస్తుండటంతో జలకళ సంతరించుకుంది. 15 రోజులుగా 8.9 టీఎంసీలని.. పార్వతిబ్యారేజ్లోకి ఎత్తిపోశారు. ఈ బ్యారేజ్ పూర్తిస్థాయిలో నిండటంతో... సరస్వతి పంపుహౌజ్‌లో మోటార్లు నిలిపివేశారు.
భద్రాద్రి వద్ద క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం :భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 2గంటల 40నిమిషాల నుంచి 43 అడుగులకు చేరిన నీటి మట్టం... ప్రస్తుతం 44 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. లోతట్టు కాలనీలు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రవహిస్తుడడంతో... ఇంకా గోదావరి నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్నందున.... లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. భద్రాచలం నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.
ఇవీ చదవండి :