How To Write A Resume A Step By Step Guide : నేటి కాలంలో మంచి ఉద్యోగం సంపాదించాలంటే.. కచ్చితంగా మంచి రెజ్యూమ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు.. మంచి ఆకర్షణీయమైన రెజ్యూమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలియక, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అదేమంత కష్టమైన పనికాదు. చాలా సులువుగా, చూడగానే ఆకర్షించే విధంగా మంచి రెజ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా సరైన ఫార్మాట్‌ను ఎంచుకోవాలి.
- రెజ్యూమ్ హెడ్లైన్ సమ్మరీ, ఆబ్జెక్టివ్లను ఆకర్షణీయంగా రాయాలి.
- వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానిని కూడా కచ్చితంగా పేర్కొనాలి.
- మీ విద్యార్హతలు, సర్టిఫికెట్ల వివరాలను ఒక ప్రత్యేకమైన లేఅవుట్లో పొందుపరచాలి.
- మీకు ఉన్న సాఫ్ట్ సిల్క్స్, హార్డ్ స్కిల్స్ గురించి స్పష్టంగా చెప్పాలి. అవి సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా వివరించాలి.
- అన్నింటికంటే ముఖ్యంగా మీ రెజ్యూమ్‌ను ప్రూఫ్‌రీడ్ చేసుకోవాలి. అంటే అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, పక్చువేషన్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాను తీసుకోవాలి.
- రెజ్యూమ్‌తో పాటు కవర్ లెటర్‌ను కూడా కచ్చితంగా జత చేయాలి. ఇప్పుడు వీటిని మరింత వివరంగా తెలుసుకుందాం.
1. సరైన ఫార్మాట్ ఎంచుకోవడం : చాలా మంది అన్ని ఉద్యోగాలకు ఒక విధమైన రెజ్యూమ్‌ను పంపిస్తూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. సాధారణంగా ఉద్యోగాల కోసం 3 రకాల స్టాండర్డ్ ఫార్మాట్లను ఉపయోగించవచ్చు. అవి ఏమిటంటే..
- క్రోనలాజికల్ రెజ్యూమ్ ఫార్మాట్ : సాధారణంగా ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ ఫార్మాట్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ ఫార్మాట్లో అభ్యర్థులు ముందుగా తమకు సంబంధించిన జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి పేర్కొంటారు.
- ఫంక్షనల్ రెజ్యూమ్ ఫార్మాట్ : ఉద్యోగ అనుభవం లేనివారు ఈ ఫార్మాట్‌ను ఎంచుకోవడం మంచిది. దీనిలో ముందుగా అభ్యర్థులు.. తమ విద్యార్హతలు, తీసుకున్న ట్రైనింగ్, నైపుణ్యాలు (స్కిల్స్) గురించి తెలియజేస్తారు. అలాగే ఎంప్లాయ్మెంట్ గ్యాప్ వచ్చినవారు కూడా ఇదే విధానాన్ని అనుసరించడం మంచిది.
- కాంబినేషన్ రెజ్యూమ్ ఫార్మాట్ : ఇది పైన పేర్కొన్న రెండు ఫార్మాట్ల సంగమం. ఉద్యోగ అనుభవం బాగా ఉన్నవారు, కెరీర్ ఛేంజర్స్ ఇలాంటి రెజ్యూమ్ ఫార్మాట్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో వారికి ఉన్న ట్రాన్సఫరబుల్ స్కిల్ గురించి ప్రత్యేకంగా పేర్కొంటారు.
కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ :
- రెజ్యూమ్‌లో మీ వ్యక్తిగత వివరాలను, కాంటాక్ట్ డిటైల్స్‌ను ఇవ్వాలి.
- మీ పేరు, పుట్టిన రోజు వివరాలను సర్టిఫికెట్స్‌లో ఉండే విధంగా క్లియర్‌గా రాయాలి.
- మీ లేటెస్ట్ ఫొటోను కచ్చితంగా జతచేయాలి.
- మీ ఫోన్ నంబర్, ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి చిరునామాలను స్పష్టంగా రాయాలి.
- మీ Linkedin ప్రొఫైల్ యూఆర్ఎల్ను కూడా ఇవ్వడం మంచిది.
ఆప్షనల్ సెక్షన్స్
- మీ సోషల్ మీడియా హ్యాండిల్స్, వెబ్‌సైట్స్ వివరాలను కూడా రెజ్యూమ్‌లో పొందుపరచవచ్చు.
- మీ హాబీలు, వ్యక్తిగత అభిరుచులను పేర్కొనవచ్చు. అయితే అవి సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటేనే.. వాటిని రాయడం మంచిది.
- వాలంటీర్ వర్క్ ఎక్స్పీరియన్స్ :కొంత మంది స్వయంగా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా.. వాలంటీర్‌గా పనిచేస్తుంటారు. ఇలాంటి వారికి సంస్థలు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కనుక మీకు వాలంటీర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే.. దానిని కచ్చితంగా రాయడమే మంచిది.
- ఇంటర్న్‌షిప్ ఎక్స్పీరియన్స్ :చదువు పూర్తయిన తరువాత ఇంటర్న్‌షిప్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే పని అనుభవం ఉన్నవారికి సంస్థలు కచ్చితంగా మొదటి ప్రాధాన్యతను ఇస్తాయి. మీకు కనుక ఇంటర్న్‌షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే.. దానిని కచ్చితంగా రెజ్యూమ్‌లో పేర్కొనాలి.
- సర్టిఫికెట్స్ అండ్ అవార్డ్స్ : కొందరు వ్యక్తులు చదువుకున్నప్పుడే కొన్ని స్పెషల్ సర్టిఫికెట్లను సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగులు.. తమ పనికి, సామర్థ్యానికి తగిన అవార్డులు పొందుతూ ఉంటారు. మీకు కూడా ఇలాంటివి ఉంటే.. వాటిని రెజ్యూమ్‌లో తప్పకుండా ప్రెజెంట్ చేయాలి.
- వచ్చిన భాషలు : నేటి కాలంలో ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికీ కచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో పాటు మీ మాతృభాష, హిందీ కూడా వచ్చి ఉంటే చాలా మంచిది. ఎక్కువ భాషలు వచ్చిన వారికి, ముఖ్యంగా స్థానిక భాషలు వచ్చిన వారికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి.
- పబ్లికేషన్స్ : మీరు కనుక బ్లాగ్స్ లేదా న్యూస్ పేపర్లలో, సైన్స్ జర్నల్స్‌లో ఆర్టికల్స్ రాసి ఉంటే వాటిని కచ్చితంగా రెజ్యూమ్‌లో పేర్కొనడం మంచిది. దీని వల్ల మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.
2. రెజ్యూమ్ హెడ్లైన్ సమ్మరీ లేదా ఆబ్జెక్టివ్ :సాధారణంగా రిక్రూటర్లు.. ఒక రెజ్యూమ్‌ను కేవలం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే చూస్తారు. అందులో వారు కచ్చితంగా చూసేది రెజ్యూమ్ హెడ్లైన్ సమ్మరీ మాత్రమే. కనుక దానిని చాలా ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేసుకోవాలి. ఇందుకోసం..
- మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద రెజ్యూమ్ హెడ్లైన్ సమ్మరీ లేదా ఆబ్జెక్టివ్‌ను రాసుకోవాలి. దీని వల్ల రిక్రూటర్ దృష్టి నేరుగా దానిపై పడుతుంది.
- ఆబ్జెక్టివ్ :సమ్మరీలో మీ గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు అప్లై చేసిన ఉద్యోగానికి.. మీరు ఏ విధంగా సూట్ అవుతారో, మీకు ఆ జాబ్ ఇస్తే.. సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతారో క్లియర్‌గా చెప్పాలి.
- స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ : ఆబ్జెక్టివ్ చెప్పిన వెంటనే మీకు ఉన్న నైపుణ్యాలు, పని అనుభవం గురించి స్పష్టంగా పేర్కొనాలి. అయితే ఈ వివరాలను వీలైనంత సంక్షిప్తంగా చెప్పాలి. వీలైనంత వరకు గరిష్ఠంగా 50 పదాలలో వివరించేందుకు ప్రయత్నించాలి. పేరాలకు పేరాలు రాయడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
3. వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ :వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ అనేది రెజ్యూమ్‌కు గుండె కాయలాంటిది. హైరింగ్ మేనేజర్లు.. చాలా వరకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్నే చాలా క్లియర్‌గా చూస్తారు. కనుక మీకు ఉన్న 10-15 ఏళ్ల ఉద్యోగ అనుభవాన్ని ఇక్కడ తెలిపే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాత్రం లెగ్త్ ఎక్కువగా ఉందని భయపడాల్సిన పనిలేదు.
వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో రాయాల్సినవి:
- కంపెనీ పేరు, లొకేషన్ : మీరు ఇంతకు మునుపు పనిచేసిన కంపెనీల పేర్లు, లొకేషన్ వివరాలను రాయాలి.
- జాబ్ టైటిల్ : ఆయా సంస్థలో మీరు ఏ ఉద్యోగం చేశారో.. వాటి గురించి చాలా స్పెసిఫిక్‌గా చెప్పాలి.
- స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ : మీరు ఆయా సంస్థలో ఎన్నాళ్లు పనిచేశారో.. తేదీలతో సహా తెలియజేయాలి.
- మీరు సదరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు.. నిర్వహించిన బాధ్యతలు గురించి, మీరు సాధించిన ఘనతల గురించి చెప్పాలి. వీలైనంత వరకు గణాంకాలు కూడా రాస్తే బాగుంటుంది.
4. ఎడ్యుకేషన్ సెక్షన్ :
- పెద్దగా ఉద్యోగ అనుభవం లేనివారు.. విద్యార్హతల సెక్షన్‌ను చాలా ఆకర్షణీయంగా రాసుకోవాలి. అకడమిక్స్‌లో మీరు సాధించిన మెరిట్స్‌ను, మెడల్స్‌ను ఇక్కడ పేర్కొనాలి.
- ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్షన్లో మీ అత్యున్నత విద్యార్హతలను పేర్కొనాలి. ఉదాహరణకు మీరు పీహెచ్డీ చేసి ఉంటే.. ముందుగా దానినే పేర్కొనాలి. దాని తరువాతనే పీజీ వివరాలు రాయాలి. ఇలా రివర్స్ ఆర్డర్లో మీ విద్యార్హత వివరాలను రాసుకోవాలి.
- మీరు విద్య అభ్యసించిన ప్రాంతం, రాష్ట్రం, యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ పేరు, మీరు చదువుకున్న సంవత్సరం కచ్చితంగా రాయాలి.
- ఈ సెక్షన్లోనే మీరు తీసుకున్న ట్రైనింగ్ వివరాలు, సాధించిన మెడల్స్ గురించి సవివరంగా పేర్కొనాలి.