How To Reduce Electricity Bill at Home :ఎండా కాలం, వర్షాకాలం, చలికాలం.. ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఉపయోగించే ప్రతి ఒక్కటి కరెంట్‌తోనడుస్తున్నవే. ఇంట్లో కరెంటు బిల్లు ఎప్పుడొచ్చినా ఎంత వచ్చిందో చూసుకునే వరకూ చాలా మందికి ఆతృత ఉంటుంది. తీరా చూసుకున్నాక ఇంత వచ్చేసిందేంటి అని లబోదిబోమంటారు. ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఇదే సీన్ కనిపిస్తుంటుంది. అయితే చిన్న చిన్న చిట్కాలను పక్కాగా ఫాలో అవ్వడం వల్ల మీ కరెంటు బిల్లును కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో చదివి.. నచ్చితే ఫాలో అవ్వండి.
కరెంట్ బిల్‌ను తగ్గించుకోవడానికి ఈ టిప్స్‌ను పాటించండి..
- ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే టీవీ, కంప్యూటర్ ప్లగ్‌లను అవసరం లేని సమయంలో బోర్డ్ నుంచి తొలగించండి. ఇవి ఆన్‌లో లేకపోయినా కరెంట్‌ను వినియోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
- ఇలా స్విచ్ ఆన్‌లో లేకుండా కూడా కరెంట్‌ను ఉపయోగించుకునే పరికరాలను వాంపైర్ ఉపకరణాలు అని అంటారు. అవసరం లేని సమయంలో కంప్యూటర్‌లను స్లీప్ మోడ్‌లో సెట్ చేసుకోండి. దీని వల్ల మీ కరెంట్ 40 శాతం వరకు సేవ్ అవుతుంది.
- మీరు ఇంట్లో వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ వంటి వస్తువులను తక్కువ సామర్థ్యంతో ఎక్కువ సార్లు వినియోగించడం వల్ల కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటిని ఉపయోగించే ముందు ఫుల్ కెపాసిటీతో నడిచేలా ప్లాన్ చేసుకోండి.
- ఏసీ, గీజర్, వాషింగ్ మెషీన్‌లను కొనేటప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవి కొనండి. ఇవి తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
- ఇంట్లో సాధారణ విద్యుత్ బల్బులను వినియోగించడం తగ్గించి.. కొత్తగా వచ్చేటటువంటి ఎల్‌ఈడీ, కాంపాక్ట్ ఫ్లోరొసెంట్ లైట్ (CFL)లను వినియోగించండి. దీని వల్ల కరెంటు వాడకం తగ్గుతుంది. ఎల్‌ఈడీ బల్బ్‌లను ఉపయోగించడం వల్ల దాదాపు 70 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
- చదువుతున్నప్పుడు స్టడీ ల్యాంప్స్‌ను వినియోగించుకోవడం వల్ల కరెంట్ సేవ్ అవుతుంది.
- రూమ్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్, ఏసీ ఎలాక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయండి.
- రూమ్‌లో ఏసీ టెంపరేచర్‌ను ఎల్లప్పుడు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సెట్ చేయండి. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు గదిలోని తలుపులు, కిటికీలను మూసి వేయాలి.
- ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చోట గ్యాస్ స్టౌవ్, వేడిగా ఉండే వస్తువులను పెట్టకండి. ఫ్రిడ్జ్, ఫ్రీజర్‌లు ఎంత చల్లగా పని చేసేలా సెట్ చేసుకుంటే, అంత ఎక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటాయి. కాబట్టి, మీ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతను 35 డిగ్రీల ఫారన్ హీట్°(F) (1.5 డిగ్రీల సెల్సియస్°C)ల నుంచి 37°డిగ్రీల ఫారన్ హీట్°(F) (3°డిగ్రీల సెల్సియస్ C) ఉండేటట్లు చూసుకోండి.
- అలాగే ఫ్రీజర్ టెంపరేచర్ -0.4°డిగ్రీల ఫారన్ హీట్°(F)ల నుంచి (-18 డిగ్రీల సెల్సియస్°C)కి సెట్ చేసుకోండి. దీని వల్ల ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం తాజాగా ఉంటుంది.
- మీ ఇంట్లో పాత టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ వంటివి ఉంటే అవి ఎక్కువగా విద్యుత్‌ను వినియోగిస్తుంటాయని గుర్తుంచుకోండి. సాధ్యమైనంత వరకు కొత్త పరికరాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.