How To Read Books Without Forgetting : పరీక్షల్లో ఎందుకు మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు, టీచర్లు అడిగితే.. "చదివింది గుర్తుండటం లేదు" అని చాలా మంది పిల్లలు సమాధానం చెబుతారు. వారు అబద్ధం చెబుతున్నారా అంటే.. కాదు వారు చెప్పేది నిజమే అంటున్నారు నిపుణులు! అయితే.. చదివే పద్ధతిని కొద్దిగా మార్చుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చని చెబుతున్నారు. మరి.. ఏ విధంగా చదవడం వల్ల గుర్తుంటుంది ? దీనికోసం ఎలాంటి పద్ధతులను ఫాలో అవ్వాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టేబుల్ ఫామ్ తయారు చేసుకోవాలి :
మీరు ఏదైనా ఒక అంశానికి సంబంధించిన విషయాలను చదువుతున్నప్పుడు.. అందులో మీకు మీరే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను తయారు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు చరిత్రను చదువుతున్నప్పుడు నాయకులు, దేశాలు, ముఖ్యమైన తేదీలు మొదలైన విషయాలన్నింటికీ ప్రత్యేకంగా టేబుల్ ఫామ్ తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే గణితం, భౌతిక శాస్త్రం లాంటి సబ్జెక్టులలో నిర్వచనాలు, ఫార్ములాలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలను విడిగా వేటికవే టేబుల్ ఫామ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చదివే విషయాల మీద ఆసక్తితోపాటు అవగాహన కూడా పెరుగుతుందని అంటున్నారు.
మళ్లీ చదవాలి :
ఏదైనా కొత్త విషయాన్ని కేవలం ఒకసారి చదివి వదిలేస్తే ఏమీ గుర్తుండదు. అందుకే మీరు తయారు చేసుకున్న నోట్సులోని విషయాలను వీలు చిక్కినప్పుడల్లా చదువుకోవాలి. అభ్యాసం చేయనిదే ఏ పనీ సాధ్యం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి.
Best Time Table for Every Student : బెస్ట్ 'టైమ్ టేబుల్' ఫిక్స్ చేయండిలా.. టార్గెట్ పగిలిపోవాలంతే..!
విశ్లేషణ చేసుకోవాలి :
సైన్స్ వంటి సబ్జెక్టులలో టెక్ట్స్ బుక్స్ చదివితే ఉపయోగం ఉండదు. ఇందులో ప్రయోగాలు, కెమికల్స్ వంటివి ఉంటాయి. కాబట్టి వీటిపై మంచి పట్టు సాధించాలంటే ప్రయోగాలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో క్లాసులు వినడం, యూట్యూబ్‌లో ప్రయోగానికి సంబంధించి వీడియోలను చూడాలని చెబుతున్నారు. ఇలా చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటారు.