How to Book General Railway Tickets by UTS App: భారతదేశంలో రైళ్లు ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడతాయి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సినప్పుడు లేదా షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు అందరూ జనరల్ టికెట్లపైనే ఆధారపడుతుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్ బోగీలు నిత్యం రద్దీగానే కనిపిస్తాయి. సీజన్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ టికెట్ కోసం క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవడం.. గంటల తరబడి క్యూలో నిలబడటం వంటి తిప్పలు తప్పవు. ఇప్పుడు ఈ ఇక్కట్లను భారతీయ రైల్వే శాఖ దూరం చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరి అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
యూటీఎస్ అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్(Unreserved Ticketing System). ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ యాప్ ప్రవేశపెట్టి చాలా రోజులు దాటినా పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ యాప్ గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్‌లోనే జనరల్ టికెట్లు, నెలవారీ సీజనల్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్ చేయొచ్చు.
యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుకింగ్ విధానం:
General Ticket Booking Procedure through UTS App:
- ఆండ్రాయిడ్ వినియోగదారులైతే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్, విండోస్ ఫోన్‌లు వాడేవారు విండోస్ యాప్ స్టోర్ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అనంతరం ఫోన్ నంబర్, పేరు, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వెంటనే వన్‌టైం పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. దాన్ని నమోదు చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌తో మన అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత టికెట్ బుకింగ్ కోసం Normal Booking’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ట్రావెల్ (పేపర్‌లెస్), ప్రింటెడ్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ప్రింట్(పేపర్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మనం ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్‌ల వివరాలు నమోదు చేయాలి. ఆపై ప్రయాణికుల (పెద్దలు, చిన్నారులు) సంఖ్య, ట్రైన్ టైప్, ఏ క్లాస్(రెండో క్లాస్, అన్‌రిజర్వ్‌డ్) వివరాలు పొందుపర్చాలి.
- తర్వాత నగదు చెల్లింపు కోసం ‘పేమెంట్ టైప్’లో ఆర్-వ్యాలెట్ లేదా ఇతర ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థలను ఎంచుకోవాలి. టికెట్‌లకు ఎంతవుతుందో తెలుసుకుని, చివరకు 'Book Ticket' ఆప్షన్’పై క్లిక్ చేయాలి. దీంతో టికెట్ బుక్ అవుతుంది.
- టికెట్ చూడాలనుకుంటే 'Show Ticket' ‘ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీరు బుక్ చేసుకున్న టికెట్ వివరాలు కనిపిస్తాయి. View Ticket పై ‘క్లిక్ చేస్తే.. టికెట్ కనిపిస్తుంది.
- ‘క్విక్ బుకింగ్’ ఆప్షన్ ద్వారా ఇది వరకు బుక్ చేసుకున్న టికెట్‌ల వివరాలు కనిపిస్తాయి. ‘ప్లాట్‌ఫాం బుకింగ్’ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవచ్చు.
- ‘సీజనల్ టికెట్స్’తో కొత్తగా నెలవారీ టికెట్ తీసుకోవచ్చు. రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు.
- ‘క్యూఆర్ బుకింగ్’ ఆప్షన్ ద్వారా.. స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా టికెట్ పొందవచ్చు.