దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో ఇంతకాలం చెరగని ముద్ర వేసుకున్న స్టాలిన్.. ఇక సీఎం పీఠాన్ని అధిరోహించి తండ్రి అడుగుజాడల్లో రాష్ట్రాన్ని పరిపాలించేందుకు సిద్ధమవుతున్నారు.
'పేరు'లోనే మ్యాజిక్...
కరుణానిధి- దయాలు అమ్మల్ రెండో కుమారుడు స్టాలిన్. స్టాలిన్ పుట్టిన నాలుగో రోజే ప్రపంచ ప్రఖ్యాత సోవియెట్ నేత జోసెఫ్ స్టాలిన్ కన్నమూశారు. ఆయనకు గుర్తుగా.. కుమారుడికి స్టాలిన్ అని నామకరణం చేశారు కరుణానిధి.
రాజకీయాల్లో స్టాలిన్...
తండ్రికి తగ్గ తనయుడిగా.. యుక్త వయసు నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండటం మొదలు పెట్టారు స్టాలిన్. ఓ టీ స్టాల్లో.. డీఎంకే తరఫున గోపాలపురం యువజన విభాగాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 14ఏళ్లకే కుటుంబసభ్యుల తరఫున ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.