తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2021, 10:52 AM IST

ETV Bharat / bharat

Nipah Virus: మళ్లీ నిఫా కలకలం.. ఆ గబ్బిలాలే కారణమా?

కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళలో నిఫా వైరస్‌(Nipah Virus in Kerala) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. తాజాగా 12ఏళ్ల బాలుడు నిఫాతో మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమైంది. శాస్త్రవేత్తలకు అంతు చిక్కని, చికిత్స లేని ఈ ప్రాణాంతక వైరస్​ నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

NIPAH VIRUS
NIPAH VIRUS

గబ్బిలాలు, పందులు, మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకే 'నిఫా వైరస్' అరుదైన, తీవ్ర ప్రాణాంతకమైన వైరస్ జాతికి చెందినది. 1999లో మలేసియాలో మొదటిసారిగా ఈ వైరస్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఆ తర్వాత 2001లో బంగ్లాదేశ్​లో గుర్తించినట్లు ప్రకటించింది. కేరళలో 12 ఏళ్ల బాలుడిని(Nipah Virus Deaths in Kerala) బలితీసుకున్న నిఫా వైరస్ మరోసారి వార్తల్లో నిలిచింది.

సంక్రమణ ఎలా..?

నిఫా వైరస్‌ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషిని ప్రత్యక్షంగా తాకడం వల్ల వ్యాపిస్తుంది. గబ్బిలాలు, పందులు, మనుషుల్లో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. ఫ్రూట్‌ బ్యాట్‌(Fruit Bat)గా పిలిచే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాధి వ్యాప్తికి తొలి వాహకాలు.

లక్షణాలు ఇవే..

నిఫా వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు(Nipah Virus Symptoms) 14 రోజుల్లో బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్లు అనిపించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది.

టీకా లేదు!.. నివారణే మందు..

నిఫా వైరస్‌కి చికిత్సే(Nipah Virus Treatment) కాదు.. టీకాలు సైతం కనుగొనలేదని వైద్యులు తెలిపారు. వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిలాలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వీటితో పాటు ఈ కింది నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • వైరస్​ సోకిన పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
  • పండ్లు, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే తినాలి.
  • తినేముందు ప్రతిసారీ చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
  • గబ్బిలాలు మామిడి పండ్లు, పనస పండ్లు, రోజ్‌ ఆపిల్స్​ను ఆహారంగా తీసుకుంటాయి. వీటిని తినే ముందు తగు జాగ్రత్తలు పాటించాలి.

గబ్బిలాలే వాహకాలు..

బారిన పడిన వారిలో దాదాపు 75 శాతం మంది ప్రాణాలను హరించి వేస్తుంది నిఫా. గబ్బిలాల్లో కనిపించే ఈ వైరస్​.. మానవులకు ఎలా సోకుతుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. అయితే.. తాజాగా ఓ అధ్యయనం(Study on Nipah Virus) మానవులకు ఎలా సోకుంతుదనే అంశాన్ని వెల్లడించింది. సుమారు ఆరేళ్ల పాటు సాగిన ఈ ఈ పరిశోధన పీఎన్​ఏఎస్​ జర్నల్​లో ప్రచురితమైంది.

"మానవుల్లో నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు.. అసలు గబ్బిలాల్లో ఎప్పుడు వ్యాపిస్తుందో తెలుసుకోవాలి. కేరళ, బంగ్లాదేశ్​లో గతంలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. భారతీయ గబ్బిలాలు ఈ నిఫా వైరస్​ను వ్యాప్తి చేస్తాయని తేలింది. గబ్బిలాలు, మానవుల మధ్య సంబంధం ఏర్పడిన క్రమంలో వైరస్​ మానవులకు సోకుతుందని సైద్ధాంతికంగా రుజువైంది. పండ్ల చెట్లల్లో పరపరాగ సంపర్కానికి గబ్బిలాలు చాలా ముఖ్యం. కాబట్టి వాటి ఉనికిని కాదనలేం. వైరస్​ వ్యాప్తి మార్గాలను అర్థం చేసుకుంటూ.. గబ్బిలాలు మన ఆహారం, నీటిని కలుషితం చేయకుండా చూసుకోవాలి."

- జోనాథన్​ ఎప్​స్టీన్​, రచయిత, పరిశోధకుడు.

గబ్బిలాల్లో చేరిన వైరస్.. వాటి మూత్రం, ఇతర శరీర ద్రవాల్లో నుంచి బయటకు వస్తుందని ఎప్​స్టీన్ తెలిపారు. ప్రధానంగా చాలా సందర్భాల్లో వైరస్​ సోకిన గబ్బిలాలు తాకిన పండ్ల ద్వారానే మానవులకు ఈ వైరస్​ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. గబ్బిలాల పంటి గాట్లు ఉన్న పండ్లను తీసుకోకపోవటం, వాటిని సరఫరాను నియంత్రిస్తే చాలా వరకు వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

యాంటీబాడీలు పుష్కలం..

గబ్బిలాల జాతిలో 60-70 శాతం వరకు నిఫా వైరస్​ యాంటీబాడీలను కలిగి ఉంటాయని.. అవి తగ్గితే వైరస్​ వ్యాప్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బంగ్లాదేశ్​లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గబ్బిలాల్లో ఈ వైరస్​ విజృంభిస్తున్నట్లు పలు పరిశోధనలు వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది.. నిఫా వైరస్​ సంక్రమణ కాలాన్ని అర్థం చేసుకునేందుకు చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.

భారత్​లో దాదాపు అన్ని ప్రాంతాల్లో గబ్బిలాలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద వృక్షాల్లో వేలాది గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకుంటాయి. గబ్బిలాలను తరిమికొట్టటం ఈ సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు. అలా చేయటం ద్వారా ఇతర ప్రాంతంలోని గబ్బిలాలకు వైరస్​ సోకి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details