నాడు లంకను చేరడానికి రాముడికి వానరసేన సాయం చేసింది. నేడు స్వదేశీ టీకా 'కొవాగ్జిన్'(Covaxin Vaccine) రూపకల్పనలోనూ భారత శాస్త్రవేత్తలకు ఆ వానరాలే అండగా నిలిచాయి. అవే లేకపోతే ఈ రోజు లక్షల ప్రాణాలు నిలిచేవి కావని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ(Balram Bhargava News) అంటున్నారు. భారత్ స్వదేశీ వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' ప్రయాణంపై ఆయన "గోయింగ్ వైరల్.. మేకింగ్ ఆఫ్ కొవాగ్జిన్ ఇన్‌సైడ్ స్టోరీ" అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో రీసస్ జాతికి చెందిన 20 వానరాల గురించి ప్రత్యేకంగా భార్గవ ప్రస్తావించారు. కొవాగ్జిన్ విజయగాథలో హీరోలు.. మనుషులు మాత్రమే కాదని, కోతులూ ఉన్నాయని తెలిపారు. వాటిని ఎంత పొగిడినా తక్కువేనంటూ, రీసస్ జాతి వానరాలను పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు పడిన తంటాలను.. ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను తన పుస్తకంలో వివరించారు.
"వ్యాక్సిన్ చిన్న జంతువుల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలదని తెలిసిన తర్వాత, తదుపరి దశ కోతుల వంటి పెద్ద జంతువులపై పరీక్షించడం. ఎందుకంటే వాటి శరీర నిర్మాణం, రోగ నిరోధక వ్యవస్థలు మానవులకు దగ్గరగా ఉంటాయి" అని భార్గవ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో రీసస్ కోతులనే ఉపయోగిస్తారు. వీటిని చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కొవిడ్-19 సమయంలో ఆ దిగుమతులు ఆగిపోవడంతో కోతులను ఎక్కడి నుంచి తేవాలన్న ఆందోళన భారత శాస్త్రవేత్తల్లో మొదలైంది. దీంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశోధకులు దేశవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలను, వివిధ సంస్థలను సంప్రదించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.