దేశంలో కొవిడ్ మహమ్మారిని తుదముట్టించేందుకు రంగం సిద్ధమైంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం.
ఎవరెవరికి వ్యాక్సిన్ ఇస్తారు?
కొవిడ్ టీకాను తొలుత ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, 50 ఏళ్లు వయస్సు పైబడిన వారికి వేస్తారు. ప్రాధాన్య క్రమంలో.. ఆ తర్వాత టీకా లభ్యతను బట్టి మిగతా జనాభాకు వ్యాక్సిన్ అందిస్తారు. అయితే వీరందరూ తొలుత.. డిజిటల్ వేదిక కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (కో-విన్)లో తప్పక నమోదు చేసుకోవాలి.
ఎప్పుడు టీకా వేస్తారు?
వారాల వ్యవధిలోనే టీకాలను విడుదల చేయటానికితాము సిద్ధంగా ఉన్నట్లు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో రూపొందించిన సీరం ఇన్స్టిట్యూట్ సంస్థ ప్రకటించింది. డీసీజీఐ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. కొవాగ్జిన్ టీకాను రూపొందించిన భారత్ బయోటెక్ కూడా త్వరలోనే తమ టీకాను విడుదల చేస్తామని తెలిపింది.
వ్యాక్సిన్‌కు డబ్బులు చెల్లించాలా?
దేశవ్యాప్తంగా తొలిదశలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులకు ఏ విధంగా టీకా అందించాలన్నదానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని తెలిపింది.
ఎన్ని టీకాలు సిద్ధంగా ఉన్నాయి?
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పది కోట్ల డోసులను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వద్ద 4 నుంచి 5 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలు నిల్వ ఉన్నట్లు సీరం సంస్థ గతంలోనే ప్రకటించింది.
ఈ టీకాలు సురక్షితమేనా?
రెండు దశల మానవ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు ఇవ్వటం సహా.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులను జారీ చేసింది.