దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి జరిగినా.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడికే ఓటు వేస్తారు కేరళవాసులు. ఎన్నోమార్లు ఈ విషయం రుజువైంది కూడా. అలాంటిది.. 2021 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆరోపణలను ఎదుర్కొని.. ముందుకు సాగి విజయ తీరాలకు చేరారు విజయన్. సీఎం పీఠంపై కూర్చునే అర్హత తనకు ముమ్మాటికీ ఉందని నిరూపించుకున్నారు.
జీవితం..
విజయన్ పూర్తి పేరు పినరయి విజయన్. ఆయన పుట్టింది.. 1945 మే 24న నాటి మద్రాసు ప్రావిన్సులోని మలబార్ జిల్లాలో. విజయన్ తల్లిదండ్రులు కోరన్, కల్యాణి. గవర్నమెంట్ బ్రెన్నెన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు సంతానం. భార్య కమల.. విజయన్ వెన్నంటే ఉంటారు.