భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. ఎటుచూసినా వరదనీటితో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్హాపుర్లోని షిరోలీ ప్రాంతంలోని ఇళ్లు, రోడ్లు, వాణిజ్య భవంతులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి.
ఆరు బృందాలుగా..
కొల్హాపుర్లో ఆరు ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలను అధికారులు మోహరించారు. ఇప్పటివరకు 1500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ తెలిపారు. సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు తాము జిల్లా యంత్రాంగం, సివిల్ వర్క్స్ విభాగంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత నీటిమట్టం 2 ఫీట్లు తగ్గిందని.. అయినా వరద ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోందన్నారు.
164కు చేరిన మృతులు..
వర్షాల కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 164కు చేరింది. సోమవారం మరో 15 మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 100 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.