Household Work Couple :ఆధునిక సమాజంలో ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఓ కేసు నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగిందంటే?
13ఏళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న 35 ఏళ్ల వ్యక్తి.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య.. ఎప్పుడూ తల్లితో ఫోన్లో మాట్లాడుతోందని, ఇంటి పనులు చేయడం లేదని కోర్టుకు తెలిపాడు. అయితే పిటిషనర్ వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు.. అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వ్యులను బాంబే హైకోర్టులో అతడు సవాల్ చేశాడు.
అయితే రోజూ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేయమని తనను బలవంతం చేశారని సదరు మహిళ హైకోర్టుకు తెలిపింది. తన పుట్టింటి వారితో మాట్లతున్నందుకు వేధింపులకు గురైనట్లు ఆరోపింతచింది. అనేక సందర్భాల్లో తనను శారీరకంగా హింసించాడని కోర్టుకు చెప్పింది.
పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తి నితిన్ సాంబ్రే, షర్మిలా దేశ్ముఖ్తో కూడిన డివిజిన్ బెంచ్ తోసిపుచ్చింది. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని.. కేవలం మహిళనే ఇంటి పనులన్నీ భార్య చేయాలని ఆశించడం పాతకాలపు ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని బెంచ్ పేర్కొంది. ఆధునిక సమాజంలో ఇంటి బాధ్యతల భారాన్ని భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని అభిప్రాయపడింది. వైవాహిక బంధం.. పుట్టింటికి భార్య దూరంగా ఉండేలా చేయకూడదని చెప్పింది. తన తల్లిదండ్రులతో సంబంధాలను తెంచుకునేలా చేయకూడదని పేర్కొంది. బాధితురాలు మానసిక క్రూరత్వాన్నికి గురైందని ఆవేదన వ్యక్తం చేసింది.