బిహార్ సారణ్ జిల్లాలోని ముబారక్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసుకు సంబంధించిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గ్రామ సర్పంచ్ సహా అతడి మద్దతుదారులకు చెందిన అనేక ఇళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు. దీంతో భయపడిన ముబారక్పుర్లోని పురుషులు గ్రామం విడిచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి ఆందోళనకారులు పరారయ్యారు.
ఇదీ జరిగింది
ఫిబ్రవరి 2న ముబారక్పుర్కు చెందిన అమితేశ్ కుమార్ సహా మరో ఇద్దరు యువకులను దారుణంగా కొట్టారు సర్పంచ్ మద్దతుదారులు. ఈ ఘటనలో అమితేశ్ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ హత్యకు సర్పంచ్ భర్త విజయ్ హస్తం ఉందని మృతుడి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన అమితేశ్ బంధువులు గ్రామంలోని సర్పంచ్ మద్దతుదారుల ఇళ్లకు నిప్పంటించారు. దీంతో అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భయపడిన గ్రామంలోని పురుషులు ముబారక్పుర్ను విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అమితేశ్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని.. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. గ్రామస్థులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.