మధ్యప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుడి హోటల్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. మంగళవారం సాగర్ జిల్లా యంత్రాంగం హోటల్‌ను నేలమట్టం చేసింది. హోటల్ యజమాని.. స్థానిక కౌన్సిలర్ అల్లుడిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని ఇటీవలే భాజపా.. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కౌన్సిలర్ అల్లుడు దారుణ హత్య.. BJP నాయకుడి హోటల్‌ను కూల్చేసిన సర్కార్!
భాజపా నాయకుడి హోటల్‌ను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది! అక్రమంగా హోటల్‌ను నిర్మించినందుకు సర్కార్ ఈ చర్య తీసుకుంది. 60 డైనమిట్లను ఉపయోగించి హోటల్‌ను నేలమట్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మకరోనియా కూడలిలో భాజపా మాజీ నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా అక్రమంగా ఓ హోటల్‌ను నిర్మించాడు. విచారణ అనంతరం జిల్లా కలెక్టర్, డీఐజీ అధ్వర్యంలో హోటల్‌ను అధికారులు కూల్చివేశారు. 60 డైనమిట్లను ఉపయోగించి గుప్తాకు చెందిన హోటల్‌ను నేలమట్టం చేశారు. "హోటల్‌ను కూల్చేముందు భద్రతా చర్యలు తీసుకున్నాం. ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డంగా ఉంచి ట్రాఫిక్‌ను నిలువరించాం. చుట్టుపక్కల ఉన్న నివాసులను అలెర్ట్ చేశాం. కూల్చివేసే సమయంలో ఎటువంటి నష్టం జరగలేదు. హోటల్ ఒక్కటే నేలమట్టం అయింది" అని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.
ఆయితే మిశ్రీ చంద్ గుప్తా స్థానిక కౌన్సిలర్ అల్లుడు జగదీశ్ యాదవ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. డిసెంబర్ 22న జగదీశ్ యాదవ్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేయించాడని, గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్ హత్య కేసులో ఎనిమిది మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుప్తాతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో.. జగదీశ్ యాదవ్ మామ కిరణ్ యాదవ్ స్వతంత్రగా పోటీ చేసి గుప్తా భార్య మీనపై 83 ఓట్లతో గెలుపొందాడు. ఈ కోపంతోనే జగదీశ్‌ను గుప్తా చంపాడని ఆరోపణలు ఉన్నాయి.