తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇవి ఆస్పత్రులా.. రియల్​ ఎస్టేట్​ పరిశ్రమలా?' - కొవిడ్​ ఆస్పత్రులపై సుప్రీం కోర్టు

సరైన మౌలిక వసతులు లేని కొవిడ్​ ఆస్పత్రులపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సిన ఆస్పత్రులు.. రియల్ ఎస్టేట్​ పరిశ్రమల్లా మారాయని వ్యాఖ్యానించింది. కనీస సదుపాయాలు లేకుండా నడుపుతున్న నర్సింగ్​ హోమ్స్​లను మూసివేయాలని ఆదేశించింది.

supreme court
సుప్రీంకోర్టు

By

Published : Jul 19, 2021, 8:35 PM IST

కరోనా వేళ ప్రజలకు సేవ చేయాల్సిన ఆస్పత్రులు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లా మారాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివాస ప్రాంతాల్లో రెండు మూడు గదులున్న ఫ్లాట్లను 'నర్సింగ్​ హోమ్స్​'గా నడుపుతున్నారని.. వాటిల్లో భద్రతా ప్రమాణాలు తక్కువ ఉన్నాయని మండిపడింది. ఇటువంటి నర్సింగ్​ హోమ్‌లకు అనుమతులివ్వకూదని ఆదేశించింది. అత్యవసర మౌలిక సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. విచారణలో భాగంగా జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​, జస్టిస్​ ఎం.ఆర్.​ షాల ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో మహారాష్ట్రలోని నాసిక్​లో జరిగిన అగ్నిప్రమాదంలో రోగులు, వైద్య సిబ్బంది మరణించిన ఘటనను ప్రస్తావించింది.

అలాగే.. చట్టాల ఉల్లంఘనలను సరిదిద్దడానికి ఆస్పత్రులకు వచ్చే ఏడాది జులై వరకు గడువును పొడిగిస్తూ.. గుజరాత్​ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 2022 జులై వరకు ఆస్పత్రులు తమ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించింది. ఆ నోటిఫికేషన్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అగ్నిమాపక భద్రతా ఆడిట్​, నోటిఫికేషన్​ వివరాలపై సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఆ రాష్ట్రానికి స్పష్టం చేసింది.

"మీరు (గుజరాత్ ప్రభుత్వం) గడువును పొడిగిస్తున్నారు. ఇది గతేడాది డిసెంబర్ 18న ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధం. ఆస్పత్రులు.. బాధలో ఉన్న రోగులకు సహాయాన్ని అందించడానికి ఉద్దేశించినవి. కానీ అవి డబ్బు సంపాదించే యంత్రాలుగా మారాయి" అని పేర్కొంది.

కొవిడ్​ ఆస్పత్రులను నెలకోసారి.. తనిఖీలు చేయాలని అన్ని రాష్ట్రాలకు గతేడాది డిసెంబర్​ 18న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అగ్నిప్రమాద ఘటనలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి:'మూడో ముప్పు సన్నద్ధత దిశగా చర్చలు ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details