ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ సీసీ టీవీ కెమెరాలు(cctv cameras in hospitals) అమర్చాలని ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈమేరకు 'ఆల్ ఇండియా కన్సూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం(Supreme court) కొట్టివేసింది. విస్పష్టమైన వినతులతో మరోసారి రావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ సీసీ టీవీ కెమెరాలు(security cameras in hospitals ) అమర్చాలంటూ ఆదేశాలివ్వలేమని.. అక్కడ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉండొచ్చని ధర్మాసనం పేర్కొంది. అలాగే వైద్యులు మందుల చీటీలను ప్రాంతీయ భాషల్లో రాయాలంటూ స్వచ్ఛంద సంస్థ చేసిన విజ్ఞాపనను కూడా తోసిపుచ్చింది. ఇదెలా సాధ్యమని ప్రశ్నించింది. కాగా పిటిషనర్ చేసిన ఒక విజ్ఞాపనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించాలన్న ఈ విజ్ఞాపనతో వస్తే పరిశీలిస్తామని తెలిపింది.
కొవిడ్-19 రోగుల నుంచి ఆసుపత్రులు, వైద్యులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి గాను ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు(Supreme court) శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసు ఇచ్చింది.
మారటోరియం విధింపు మా పరిధిలో లేదు
బ్యాంకుల నుంచి ప్రీ స్కూళ్ల నిర్వాహకులు తీసుకున్న రుణాల చెల్లింపుపై వడ్డీరహిత మారటోరియం విధించేలా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. అది తమ పరిధిలో లేని విషయమని స్పష్టం చేసింది. ప్లే (ప్రీ) స్కూళ్ల సంఘం- 'ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఐసీఈసీఈఐ)' తాజా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.