ఆస్పత్రి సిబ్బంది పొరపాటు.. గ్రామస్థుల అమానవీయత వెరసి.. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి సొంత గ్రామంలో అంత్యక్రియలకు నోచుకోని దుస్థితి. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. గడగ్ జిల్లా బసలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. కొవిడ్ నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక.. అదే అంబులెన్స్‌లో తిరిగి నగరానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
ఫుట్‌పాత్‌పైనే..
బెంగళూరులో కరోనాతో మరణించిన మృతదేహాన్ని ఫుట్‌పాత్‌పైనే వదిలివేశాడో అంబులెన్స్ డ్రైవర్. అంత్యక్రియల కోసం శ్మశాన వాటికలో వేచి ఉన్న క్రమంలో.. వ్యక్తి బంధువులు ఆలస్యంగా వస్తారని భావించిన సదరు డ్రైవర్.. శ్మశానవాటిక ఫుట్‌పాత్‌పైనే దించేసి వెళ్లిపోయాడు.
కొవిడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డ్రైవర్ రూ.10,000 అడిగాడని.. తమ ఆర్థిక పరిస్థితి కారణంగా రూ.3000 మాత్రమే ఇచ్చినందున ఇలా చేశాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వీధిలో ఉన్న మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు.