Horse Library for Students :గుర్రంపై గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. వినూత్నంగా ఆలోచించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. కొండలెక్కి, కోనలు దాటి మరి.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల చెంతకు పుస్తకాలను చేరుస్తున్నాడు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకపోవడాన్ని గుర్తించిన.. శుభమ్ బధాని అనే వ్యక్తి గుర్రం గ్రంథాలయానికి శ్రీకారం చుట్టాడు.
నైనితాల్ జిల్లాకు చెందిన శుభమ్ బధాని.. 2023 వేసవి కాలం సెలవుల్లో మొబైల్ లైబ్రరీని ప్రారంభించాడు. సెలవుల్లో ఇంటివద్దే ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పోకుండా.. సహృదయంతో బైక్పై మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. అయితే భారీ వర్షాల కారణంగా.. సెలవుల అనంతరం కూడా విద్యార్థులెవ్వరూ పాఠశాలకు వెళ్లలేకపోయారు. అంతేకాకుండా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి.. రోడ్లన్నీ మూసుకుపోయాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జనజీవనమంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇక చేసేది లేక కొంత కాలం పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో బైక్పై మొబైల్ లైబ్రరీని నడిపేందుకు శుభమ్ బధానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బైక్పై మొబైల్ లైబ్రరీ నడపడం అతడికి సాధ్యం కాలేదు. ఎలాగైనామొబైల్ లైబ్రరీని విద్యార్థుల చెంతకు చేర్చాలన్న సంకల్పంతో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టి.. గుర్రం లైబ్రరీని ఏర్పాటు చేశాడు శుభమ్ బాధాని. అనంతరం దాని సాయంతో ప్రతి ఊరు తిరిగి చిన్నారుల్లో పఠనాసక్తిని పెంచుతున్నాడు. కొండ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా పుస్తకాలకు అందిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని శుభం బాధాని వెల్లడించాడు.