బంగాల్లో ఓ భారీ ప్రమాదం జరిగి ఐదుగురు మృతిచెందారు. నదియాలోని నకశిపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న.. 34 నాల్గవ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
లారీ, కారు ఢీ.. ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతి
జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీకొని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. మరో ఘటనలో ఓ కారు అదుపుతప్పి 70 అడుగుల లోతున్న బావిలో పడి.. మామ, మేనల్లుడు అక్కడికక్కడే మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకశిపరాలోని జాతీయ రహదారిపై.. ఓ భారీ లారీ, ఓ మారుతీ కారు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. కొందరు పాదచారులు కారులో ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపుమడుగులో ఉన్న ఇద్దరు పిల్లలు, ఒక మహిళ, ఇద్దరు పురుషులను బయటకు తీశారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
మరో ఘటనలో.. గుజరాత్లో భాయ్ దూజ్ పండుగ రోజు ఓ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పంచమహల్ జిల్లా మోర్వా హడాఫ్ ప్రాంతంలోని డెలోట్ గ్రామంలో పండుగ జరుపుకోవడానికి .. ఇద్దరు అన్నాదమ్ములు తన సోదరి ఇంటికి వెళ్లారు. తన మేనమామతో కలిసి గురువారం రాత్రి కారులో తిరిగి వెళ్తుండగా పంచ్మహల్ హైవేపై.. కారు అదుపుతప్పి 70 అడుగుల లోతులో ఉన్న బావిలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరూ.. నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయారు.