ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. 20 ఏళ్ల యువతిని చంపి బియ్యం బస్తాలో కట్టి ఓ నదిలో పడేశారు. ఆమె మృతదేహం ఓ నది ఒడ్డున లభ్యం అవ్వడం వల్ల ఈ ఘటన వెలుగు చూసింది. బాలిక ప్రేమ వ్యవహారం ఇష్టం లేక ఆమె కుటుంబీకులే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం..
కుశీనగర్ జిల్లాలోని బడి గండక్ నదికి ఆనుకొని నిర్మించిన నర్వాజోత్ డ్యామ్‌కు సమీపంలో బాలిక మృతదేహం బయటపడింది. ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని కుక్కి అక్కడ పడేశారు. సెవ్రాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక డెడ్‌బాడీ ఉందని సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తన గ్రామంలోని ఓ అబ్బాయితో ప్రేమలో ఉండేదని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అడ్డు చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ పరువు పోతుందనే కారణంతో ఇంట్లో వారే ఆమెను హత్య చేసి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. దీని ఆధారంగా, బాలిక తండ్రి, మామ, సోదరుడే ఆమెను హత్య చేసి నదిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ముగ్గురితో పాటు, కుటుంబంలోని మహిళలనూ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు తీవ్రతతో పాటు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఏఎస్పీ రితేష్ కుమార్ సింగ్ తెలిపారు.
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపైనే అఘాయిత్యం..
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తాను వివాహం చేసుకోబోయే 17 ఏళ్ల యువతిపై హత్యాచారం చేశాడు. నిందితుడు బుల్దానా జిల్లా వరుద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి.. బెలోరా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికతో మార్చి 17న వివాహం నిశ్చయించారు కుటుంబ సభ్యులు. పెళ్లి పనుల్లో భాగంగా కొత్త దుస్తులు కొనేందుకు మృతురాలి తరఫువారు లోనార్కు వెళ్లారు. ఇది తెలుసుకున్న నిందితుడు. ఎవరూ లేని సమయం చూసి యువతిపై అత్యాచారం చేసి ఆపై గొంతు కోసి చంపేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన వారికి బాలిక రక్తపుమడుగులో ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంధువులు నిరసన దిగారు. నిందితుడి కుటుంబానికి ఇచ్చిన రూ.2 లక్షల కట్నాన్ని కూడా తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్పీ అక్షయ్ శిందే వెల్లడించారు.
రైల్వే బ్రిడ్జికి వేలాడుతూ..
రాజస్థాన్‌లోని దహర్ కా బాలాజీ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ వంతెనకు ఆదివారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడుని గుజరాత్ సూరత్‌కు చెందిన మనోజ్ బన్సాల్(40)గా గుర్తించారు. ఇతడు రాజస్థాన్‌లోని జోత్వారా ప్రాంతానికి బతుకుతెరువు కోసం వలస వచ్చాడు. కాగా, డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచామని.. కుటుంబీకులు వచ్చాకే శవపరీక్ష నిర్వహిస్తామని రైల్వే పోలీస్ అధికారి సంపత్ రాజ్ తెలిపారు. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగానే భావిస్తున్నామని, విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.