Honour killing in bihar: పరువు కోసం కన్నకూతురినే పొట్టన పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. 'నాన్న నన్ను చంపకండి ప్లీజ్.. నేను మీ కూతురిని, నన్ను వదిలేయండి' అంటూ ఆమె బతిమాలుతున్నా కనికరించలేదు. తండ్రి వయసు ఉన్న వ్యక్తితో నిశ్చయించిన పెళ్లిని కాదని మరో వ్యక్తిని ప్రేమించడమే ఆ అమ్మాయి చేసిన తప్పు. ఎంత బతిమలాడినా ఆ తండ్రి రాతిగుండె కరగలేదు. కుమార్తెను దారుణంగా హింసించి ఆపై హత్య చేసి మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశాడు. ఇదంతా బిహార్‌లోని దర్భంగా జిల్లా రతన్పుర గ్రామంలో నెల రోజుల క్రితం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఆడియో వైరలవడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
'నన్ను వదిలేయండి నాన్న'..: తండ్రి కుమార్తెను హత్య చేస్తున్న సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ రికార్డ్ చేసిన ఓ ఆడియో ప్రస్తుతం వైరలైంది. 'నాన్న నన్ను చంపకండి ప్లీజ్.. నేను మీ కూతురిని, నన్ను వదిలేయండి' అని 20 ఏళ్ల అఫ్రీన్ తండ్రి ఉస్మాన్‌ను వేడుకోవడం అందులో రికార్డ్ అయింది. ఏప్రిల్ 15న అఫ్రీన్‌ను హత్య చేసిన ఉస్మాన్.. మృతదేహాన్ని చెరువులో పడేసి.. కుమార్తె ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందినట్లు నమ్మబలికాడు. మరుసటి రోజు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు అఫ్రీన్ నీటమునగడం వల్లే మృతిచెందిందని భావించి ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
ఎవరికైనా చెప్తే చంపేస్తా..: 'అఫ్రీన్ హత్య విషయం బయట ఎక్కడైనా తెలిసిందంటే ఆమెకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది' అంటూ కుటుంబసభ్యులను బెదిరించాడు ఉస్మాన్. దీంతో అతని భార్య షబానా ఖాతునా, ముగ్గురు పిల్లలు.. నెల రోజుల పాటు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా గుట్టుగా ఉంచారు. కానీ ఉస్మాన్ బెదిరింపులకు భయపడి రక్షణ కోసం వాళ్లు ఈనెల 21 పోలీసులను ఆశ్రయించడం వల్ల అసలు విషయం బయటపడింది. దీనిపై స్పందించిన పోలీసులు.. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని.. వైరలైన ఆడియోకు హత్య సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు.