ఉత్తర్‌ప్రదేశ్ మథురలో పరువు హత్య కలకలం రేపింది. ట్రాలీ బ్యాగులో 21 ఏళ్ల యువతి మృతదేహం కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. నవంబరు 17న జరిగిన ఈ ఘటన జరగ్గా.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని దిల్లీకి చెందిన ఆయుషీ యాదవ్‌గా గుర్తించారు.
పరువుహత్య కలకలం.. చెప్పకుండా బయటకెళ్లిందని కూతుర్ని చంపి, సూట్‌కేస్‌లో కుక్కి..
తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందనే కోపంతో కన్నకూతురినే హతమార్చాడు ఓ తండ్రి. అనంతరం కుమార్తె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని ఓ రోడ్డు పక్కన పడేశాడు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యమునా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీసు రోడ్డు సమీపంలో ఓ బ్యాగులో రక్తంతో తడిసిన యువతి మృతదేహం ట్రాలీ బ్యాగులో స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తేలింది. తనకు చెప్పకుండా బయటకు వెళ్లిందనే కోపంతో ఆయుషిని చంపానని నిందితుడు.. పోలీసులు ఎదుట అంగీకరించాడు.
నవంబర్ 17న ఆయుషిని తుపాకీతో కాల్చి చంపాడు ఆమె తండ్రి. అనంతరం కాళ్లు, చేతులు మడిచి ట్రాలీ సూట్‌కేసులో పెట్టేశాడు. ఆయుషి మృతదేహాన్ని కారులో దిల్లీ నుంచి మథుర తీసుకొచ్చి.. యుమునా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.