కర్ణాటక బాగలకోట్ జిల్లాలో పరువు హత్య జరిగింది. జమఖండి తాలూకాలోని తక్కోడ గ్రామంలో శనివారం తన కూతురిని పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రే ఓ యువకుడిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
'పరువు' కోసం ప్రేమపై పగ.. కూతురి భర్తను వెంటాడి చంపిన తండ్రి - కర్ణాటకలో కూతురి భర్తను చంపిన తండ్రి న్యూస్
కర్ణాటకలో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులానికి చెందిన వ్యక్తి.. తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని ఆ యువకుడ్ని హత్యచేశాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. హత్యకు గురైన యువకుడు భుజబలి(34). ఈ యువకుడు, మరో వర్గానికి చెందిన భాగ్యశ్రీ ప్రేమించుకున్నారు. కొన్ని నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే శనివారం రాత్రి హనుమంతుడి పల్లకి ఉత్సవం తర్వాత భుజబలి తన సోదరుడి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో భాగ్యశ్రీ తండ్రి తమ్మనగౌడ పాటిల్.. ఆ యువకుడిపై కారం చల్లి, కత్తితో పొడిచి హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం నిందితుడు జమఖండి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు ముందే పోలీసులు.. యువతి తల్లిదండ్రులు, యువకునికి మధ్య రాజీ కుదిర్చారు. దీని తర్వాతే యువకుడు, యువతి ఆ పట్టణానికి వచ్చినట్లు తెలిసింది.