ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ వ్యక్తిని ప్రేమించిందని యువతిని తన కుటుంబ సభ్యులు, బంధువులు హతమార్చారు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హాపుడ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హఫీజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర్ అనే గ్రామంలో ఓ యువతి నివసిస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను వారించారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మూడు రోజులకు గురువారం రాత్రి ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సరైన విధంగా స్పందించి ఉంటే ఆ యువతి ప్రాణాలు కోల్పోకుండా ఉండేది అని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘనకు సంబంధించి బాధితురాలి సోదరుడు అరుణ్, బాబయ్ ధీరు, పెద్దనాన్న కుమారుడు అనుజ్, బాబాయ్ కుమారుడు ఛత్రూపై ఆ గ్రామానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న ఆ నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రైలు పట్టాలపై వలస కూలీ మృతదేహం.. స్పందించిన బిహార్ సర్కార్..
ఉత్తర భారతదేశానికి చెందిన వలస కార్మికులు తమిళనాడులోని తిరుపూర్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. బిహార్‌కు చెందిన ఓ వలస కార్మికుడిని చంపి.. రైలు పట్టాలపై పడేశారని ఆరోపించారు. దీంతో తిరుపుర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై నీతీశ్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. వలసకూలీలపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపనున్నట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది.