Honeytrap case: మాజీ మిస్టర్ రాజస్థాన్‌పై వలపు వల విసిరి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన కిలేడీని జైపుర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై కీలక అంశాలను వెల్లడించారు సంజయ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారి మోహమ్మద్ శఫీక్ ఖాన్.
'కిలేడీ' వలపు వల.. 'మిస్టర్ రాజస్థాన్' విలవిల! - మిస్టర్ రాజస్థాన్
Honeytrap case: హనీట్రాప్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. అందంతో యువకులకు వలపు వల విసిరి, ఆ తర్వాత బెదిరించి డబ్బులు లాగుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మాజీ మిస్టర్ రాజస్థాన్‌పై వలపు వల విసిరి.. రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.6 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు.
కేసు వివరాలు ఇలా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌కు చెందిన రాధా సైనీ అనే యువతి గతంలో మోడలింగ్ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని చిత్రకూట్ ప్రాంతం డీసీఎం అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటోంది. ఐదేళ్ల క్రితం మాజీ మిస్టర్ రాజస్థాన్ అయిన అనీస్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆమె కపట ప్రేమను గుర్తించలేకపోయాడు అనీస్. కొన్నాళ్లు ఇరువురు సహజీవనం చేశారు. ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.6 లక్షల వరకు దోచుకుంది. ఇటీవలే యువకుడికి మరో యువతితో వివాహం జరిగింది. అది తెలుసుకున్న నిందితురాలు.. మళ్లీ వేధించటం మొదలు పెట్టింది. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే అత్యాచారం కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరించింది.
దీంతో బాధితుడు సంజయ్ సర్కిల్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. బాధితుడి దగ్గర నుంచి రూ.50వేల నగదు, రూ.19.50 లక్షల విలువైన మూడు చెక్కులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. హనీ ట్రాప్ ముఠాలో ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు సంజయ్ సర్కిల్ అధికారి మోహమ్మద్ శఫీక్ ఖాన్ తెలిపారు. యువతి ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నామని, దాని ద్వారా ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించటం సులభమవుతుందని చెప్పారు.