విదేశీ విరాళాల సేకరణ విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు దస్త్రాలను వక్రీకరించడం చేయడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.
హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్‌ను 2002లో నెలకొల్పారు.