Home Guard Killed By Sand Mafia :ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన ఓ హోంగార్డును హత్య చేశారు దుండగులు. అతడిపై నుంచి ట్రాక్టర్‌ను పోనిచ్చారు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది..
మదన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్మి కోయిరి బిఘా గ్రామానికి చెందిన రామ్రాజ్ మహతో.. ఎన్టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఔరంగాబాద్ సమీపంలోని బఢేమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఏఎస్ఐ రాజేశ్ కుమార్.. తన సిబ్బందితో కలిసి కాంకేర్ రోడ్డుకు వెళ్లారు. వీరిని గమనించిన దుండగులు.. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు.
ఈ క్రమంలోనే ట్రాక్టర్.. సమీపంలోని ఎన్టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లడం వల్ల అక్కడి పోలీసుల సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎన్టీపీసీ ఖైరా పోలీసులు.. మాధే గ్రామం వద్ద దుండగులను చుట్టుముట్టారు. అయితే, రోడ్డుకు అడ్డంగా నిలబడిన హోంగార్డు రామ్రాజ్ మహతోను దుండగులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి అతడిపై నుంచి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడిని ఎన్టీపీసీ ఆస్పత్రికి తరలించారు. రామ్‌రాజ్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.