మృతదేహాల మధ్య హోలీ సంబరాలు.. చితాభస్మం ఒకరిపై ఒకరు చల్లుకుంటూ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పవిత్ర గంగానది తీరంలో వేల సంఖ్యలో ప్రజలు, భక్తులు హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ హోలీ సంబరాలను అక్కడ కాలుతున్న మృతదేహాల మధ్య.. చితాభస్మాన్ని ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందంతో కేరింతలు కొట్టారు. ఒక పక్క మరణించిన వారి కుటుంబసభ్యులు మృతులకు దహన సంస్కారాలు జరుపుతుంటే మరోవైపు ఈ వేడుకలు జరగడం విశేషం. ప్రతీ ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా హోలీ వేడుకల్లో భారీగా ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
రంగులతో పాటుగా చితాభస్మాన్ని చల్లుకుంటున్న భక్తులు వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లోని అక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రతి ఏటా హోలీ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, భక్తులు వివిధ రంగులతో పాటుగా చితాభస్మాన్ని ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. అయితే ఈ మణికర్ణికా ఘాట్‌లో నిరంతరం మృతుల దహన సంస్కారాల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మృతులకు అంతిమ సంస్కారాలు జరుగుతున్నా సరే.. అక్కడ ప్రజలు కాలుతున్న మృతదేహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటారు. దీంతో పాటుగా ప్రజలు, సందర్శకులు రకరకాల వేషాలు వేసుకుంటూ రంగులు జల్లుకుంటారు.
మహా శివుడు, పార్వతి దేవీకి వీడ్కోలు చెప్పి కైలాసానికి వెళ్లి.. మరుసటి రోజు ఆ నీలకంఠుడు తిరిగి వారణాసికి వస్తాడు. ఆ తర్వాత శివుడితో పాటుగా భక్తులతో హోలీ ఆడేందుకు దెయ్యాలు ఈ శ్మశానవాటికకు వస్తాయని ఆలయ నిర్వహకుడు జంత్రలేశ్వర్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహిస్తామని.. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజలు శివపార్వతులకు ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే ఈ హోలీ సంబరాల్లో కొందరు విదేశీ భక్తులు కూడా పాల్గొన్నారు. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని ఎక్కడా చూడలేదని విదేశీ పర్యాటకులు తెలిపారు.
గంగానది తీరంలో హోలీ జరుపుకుంటున్న ప్రజలు, భక్తులు బోన్ ఆర్న్ బ్యాంక్..
గంగానది తీరంలో ఉన్న కాశీ పుణ్యకేత్రం మోక్ష నగరంగా పేరొందింది. దీంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మరణించిన వారి దహన సంస్కారాలు జరిపితే.. వారి ఆత్మకు మోక్షం కలుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు. దీంతో పాటు ఈ వారణాసి నగరంలో మరణించిన వారికి తప్పని సరిగా శివలోకం ప్రాప్తిస్తుందని హిందువుల విశ్వాసం. దీంతో ప్రతిరోజూ ఈ గంగానది తీరంలో ఉన్న ఘాట్లలో తమ ఆత్మీయులకు అంతమసంస్కారాలు జరిపి.. అస్థికలను గంగలో కలుపుతుంటారు. అయితే ఇక్కడున్న మణికర్ణిక ఘాట్‌లో 24 గంటల పాటు మృత దేహాలకు దహనసంస్కారాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అంతిమ సంస్కారాలకు, అస్థికలను గంగలో కలపడానికి వస్తారు.
అయితే సుదూర ప్రాంతాలనుంచి ఈ వారణాసి నగరానికి చేరుకుని అంత్యక్రియలు చేసేటప్పుడు కొన్ని సార్లు ఆ చితిమంటలు అంత త్వరగా చల్లారవు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఆ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేంత వరకు వేచి ఉండలేరు. దీంతో మృతుల చితాభస్మం గంగలో నిమర్జనం చేసే సంప్రదాయం పూర్తవ్వదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం చితాభస్మం, ఎముకలు గంగలో కలిపితేనే చనిపోయిన వారి ఆత్మకు మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం కనుగొంది. దీనికోసం అని యూపీ ప్రభుత్వం వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో 'బోన్ ఆర్న్ బ్యాంక్ (అస్థి కలాష్ బ్యాంక్)'ను దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయబోతోంది.
ప్రస్తుతం మణికర్ణిక ఘాట్‌లో ఈ బోన్ ఆర్న్ బ్యాంక్‌కు సంబంధించి పనులు ప్రారంభించనున్నట్లు వారణాసి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్పీ సింగ్ వెల్లడించారు. అయితే అంత్యక్రియలు జరుగుతుండగా మధ్యలోనే తిరుగు ప్రయాణం అయ్యే వారికి.. సంబంధించిన అస్థికలు, చితాభస్మాన్ని ఈ బ్యాంక్‌లో భద్రపరుస్తారు. ఇక్కడ ఎముకలను సురక్షితంగా ఉంచే పని నామమాత్రపు రేటుతో జరుగుతుంది. దీంతో కొన్ని రోజుల తర్వాత ఇక్కడకు చేరుకుని డబ్బు చెల్లించి తమ వారి అస్థికలను గంగలో కలపొచ్చు.