Online gaming scam: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా.. ఇంకా పలుచోట్లా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని కొన్ని ఆన్‌లైన్ సంస్థలు/యాప్‌లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాజాగా హరియాణాలో ఓ ఆన్‌లైన్ ఘరానా మోసం బయటపడింది. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హిసార్‌లోని పటేల్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తనకు జరిగిన ఆన్‌లైన్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విన్మనీ అనే మొబైల్ గేమింగ్ యాప్‌లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని, అయితే ఆ డబ్బు తిరిగి రాలేదని తెలిపాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బాధితుడికి జరిగిన మోసాన్ని ఛేదించారు. విన్మనీ యాప్‌లో ఫిర్యాదుదారుడు డిపాజిట్ చేసిన డబ్బు ..మహారాష్ట్రలోని ఓ బ్యాంకు ఖాతాకు వెళ్లిందని, ఆపై ఒడిశాలోని బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని జైపుర్‌లో, ఇద్దరిని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసానికి సంబంధించి చైనా, దుబాయ్‌లకు కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకడైన ఆకాశ్ నుంచి రూ.3 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపుర్‌లో అతడికి 13 బ్యాంక్ ఖాతాలున్నట్లు విచారణలో తేల్చారు. మరో నిందితుడు సచిన్ గుడాలియా ఖాతా నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.