మరణంలోనూ విడదీయలేని స్నేహం వారిది. ఒకరు హిందూ, మరొకరు ముస్లిం. అయితేనేం మతం వారి స్నేహానికి అడ్డురాలేదు. తమిళనాడు అరియలూర్ తాలూకా జయకొండంలో నివసించే మహాలింగం(70), జైలబుద్దీన్(66) మతాలు వేరైనా ప్రాణ స్నేహితులుగా మెలిగేవారు. అయితే అనుకోని విధంగా వారిద్దరూ అర గంట వ్యవధిలోనే మరణించడం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది.
ఎదురెదురు ఇళ్లలో నివాసం..
స్థానిక విరుధాచలం రోడ్డులోని మారియమ్మన్ ఆలయంలో మహాలింగం పూజారి. ఆలయానికి సమీపంలోనే టీ స్టాల్ కూడా నడిపేవాడు. జైలబుద్దీన్ రైస్ మిల్లు యజమాని. మహాలింగం ఇంటికి ఎదురుగా నివసిస్తున్నాడు.
మహాలింగం ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలకు జైలబుద్దీన్ కుటుంబంతో సహా హాజరయ్యేవాడు. అలానే జైలబుద్దీన్ ఇంట్లో నిర్వహించే ముస్లిం పండుగలకు మహాలింగం తప్పక వెళ్లేవాడు.