నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే మేరఠ్ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. నగరంలో ఉన్న ముఖ్యప్రదేశాల పేర్లకు సైతం హిందూ నేతల పేర్లను పెడతామని వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఓ మేనిఫెస్టో సైతం విడుదల చేసింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని, గోమాతను కాపాడుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొంది.
'మేరఠ్ పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తాం'.. హిందూ మహాసభ వాగ్దానం - హిందూ మహాసభ మేనిఫెస్టో
నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే మేరఠ్ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. నగరంలో ఉన్న ముఖ్యప్రదేశాల పేర్లను మార్చి హిందూ నేతల పేర్లను పెడతామని పేర్కొంది.
"హిందూ మహాసభకు తగినన్ని కౌన్సిలర్ సీట్లు వచ్చి మా అభ్యర్థి మేయర్ అయితే నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తాం. నగరంలోని ఇతర ప్రాంతాలకూ హిందూ నేతల పేర్లు పెడతాం" అని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ తెలిపారు. నగరపాలక సంస్థలో అన్ని వార్డులకూ పోటీ చేస్తున్నామని, దేశభక్తి కలిగిన వారికే అవకాశం ఇస్తామని హిందూ మహాసభ మేరఠ్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా భాజపా, శివసేనపై విమర్శలు గుప్పించారు. "భాజపా హిందూ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో ఇతర వర్గాలకు చెందిన వారి సంఖ్య పెరిగింది. శివసేన సైతం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ రెండు పార్టీలూ ఐడియాలజీకి దూరమవుతున్నాయి" అని విమర్శించారు.