Hindi national language controversy: ఇకపై హిందీ మన జాతీయ భాష కాదంటూ ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కన్నడ స్టార్ సుదీప్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా రాజకీయ నాయకులు గళం విప్పుతున్నారు. "హిందీ వారే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా విజయం అందుకోలేకపోతున్నారు. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు" అని ఓ ఆడియో ఫంక్షన్‌లో సుదీప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్.. హిందీ జాతీయ భాష కానప్పుడు మీ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని ట్వీట్‌లో ప్రశ్నించారు. జాతీయ భాషగా ఎప్పటి నుంచో హిందీ ఉందని ఎప్పటికీ అదే ఉంటుందని ట్వీట్ చేశారు. దీనిపై మళ్లీ ట్విటర్ వేదికగా స్పందించిన సుదీప్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను తాను చదవగలిగానని, కానీ తాను కన్నడలో ట్వీట్ చేస్తే మీ పరిస్థితి ఏంటని అజయ్ దేవ్‌గణ్‌ను ప్రశ్నించారు. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజకీయ రంగు:ఈ ఇద్దరి నటుల ట్వీట్ల వార్‌లోకి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వచ్చారు. సుదీప్ వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భాషా ప్రాతిపదికనే కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. సుదీప్ వ్యాఖ్యలు సమంజసమే అన్న బొమ్మై, ఆ వ్యాఖ్యలను గౌరవించాలన్నారు. అజయ్ దేవగన్ వ్యాఖ్యలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్న సిద్ధరామయ్య, దేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ట్వీట్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్ చేసిన మాజీ సీఎం కుమారస్వామి.. భారతీయ జనతా పార్టీ హిందీ జాతీయవాదానికి అజయ్ దేవగణ్ మౌత్ పీస్ అని తీవ్రంగా విమర్శించారు.