తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం సీఎంగా హిమంత- ఆయనే ఎందుకు? - అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ

హిమంత బిశ్వ శర్మ.. ప్రస్తుతం అసోం రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించింది భాజపా. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్​ను కాదని.. హిమంతకు సీఎం పదవి కట్టబెట్టడానికి కారణాలేంటి? అనతికాలంలోనే భాజపాలో కీలక నేతగా ఎలా ఎదిగారు?

Himanta biswa sarma
అసోం సీఎంగా హిమంత

By

Published : May 9, 2021, 1:27 PM IST

అసోం ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. ఇప్పటివరకు సీఎంగా ఉన్న సర్బానంద సోనోవాల్​ను కాదని పార్టీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ వైపు మొగ్గు చూపింది భాజపా అధిష్ఠానం. ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రిగా ఐదేళ్లు విజయవంతంగా పాలన సాగించి.. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన సోనోవాల్​ను కాదని.. హిమంత శర్మను ఎన్నుకోవటానికి గల కారణాలేంటి? ఓసారి పరిశీలిస్తే..

అసోం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని 'మిత్రజోత్​'​ కూటమి ఘటన విజయం సాధించింది. ఫలితాలు వెలువడిన తర్వాత శర్మ, సోనోవాల్​.. ఎమ్మెల్యేలతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరిని దిల్లీ పిలిపించి.. పలు దఫాలుగా చర్చలు జరిపింది జాతీయ అధిష్ఠానం. ఈ భేటీలోనే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దిల్లీ పర్యటన చేపట్టిన మరుసటి రోజే ప్రకటన వెలువడింది.

సంక్షోభ పరిష్కర్తగా..

ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌ హోదాలో ఈ ప్రాంతంలో సంక్షోభ పరిష్కర్తగా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయనపై మంచి గురి ఉంది.

అసోం ఒక్కటే కాదు.. ఈశాన్య ప్రాంతంలో తొలిసారి భాజపా గణనీయంగా పుంజుకోవడానికి శర్మానే కారణంగా చెప్పుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు సన్నిహితుడిగా మెలుగుతూ, చిన్న రాష్ట్రాలైన మణిపుర్​, మేఘాలయాలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. తానేంటో నిరూపించుకున్నారు శర్మ. అరుణాచల్​ ప్రదేశ్​లో తిరుగుబాటుకు బీజం వేసి.. కాంగ్రెస్​ను కూలదోయటంలో కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. 2017లో మణిపుర్​లో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్​ను అధికారం నుంచి దింపి.. భాజపా నేతృత్వంలోని కూటమిని గద్దెనెక్కించారు. మిత్రపక్షాలతో చర్చలు చేపట్టి మేఘాలయలోనూ భాజపాకు అధికారాన్ని కట్టబెట్టారు. నాగాలాండ్​లో నాగాపీపుల్స్​ ఫ్రంట్​, నేషనల్​ డెమొక్రటిక్​ ప్రోగ్రెసివ్​ పార్టీ, భాజాపా మధ్య కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.

2015లో కాంగ్రెస్​కు గుడ్​బై..

కాంగ్రెస్​ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హిమంత బిశ్వ శర్మ.. తన రాజకీయ గురువు తరుణ్​ గొగొయి అధికారం కోల్పోయిన క్రమంలో 2015లో పార్టీని వీడారు. పార్టీలో తమకు సరైన గౌరవం లేదని ఆరోపించారు. పార్టీ వీడిన వెంటనే.. పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు.

బంగాల్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారి మాదిరిగానే.. శర్మకు వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ కల్పించారు అమిత్​ షా.

ఇదీ చూడండి:అసోం సీఎంగా హిమంత- రేపే ప్రమాణం!

ABOUT THE AUTHOR

...view details